ప్రజల ఆరోగ్య సూచీల(Public Health Index)ను రూపొందించడంపై యుద్ధప్రాతిపదికన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సూచీలను (ముఖచిత్రాలు-హెల్త్ ప్రొఫైల్స్) ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపర్చేందుకు ఐఐటీ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఓ సాఫ్ట్‌వేర్(software)ను రూపొందించారు. దీని పనితీరుపై సోమవారం వైద్యశాఖ కార్యదర్శి రిజ్వీ నేతృత్వంలో ఉన్నతస్థాయి అధికారులు సమావేశమై చర్చించారు. ఈ సూచీల(Public Health Index) కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో వచ్చే నెలలో ప్రారంభించాలని ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించిన విషయం విదితమే. దీనిపై సమగ్ర కార్యాచరణ రూపొందించడానికి మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు త్వరలోనే ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల(Telangana health ministry)తో భేటీ కానున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.
ఎత్తు, బరువు, బీపీ, షుగర్ వంటివి ఇంటింటికి వెళ్లి పరీక్షించనుండగా.. ఈసీజీ(ECG) సహా కొన్ని రక్త, మూత్ర పరీక్షలను సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించనున్నారు. వీటి సమాచారాన్ని ఆరోగ్య కార్యకర్తలు సాఫ్ట్‌వేర్‌లో పొందుపర్చుతారు. ఈ క్రమంలో ప్రతి వ్యక్తికి ఏకీకృత నంబర్ కేటాయిస్తారని వైద్యవర్గాలు తెలిపాయి. ఈ అంశాలన్నింటిపైనా వైద్యశాఖ కార్యదర్శితో జరిగిన సమావేశంలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చర్చించారు.