ఆదిపత్యవాదం సామాజిక న్యాయానికి అడ్డంకిగా మారిందని ఆచార్య కె.నాగేశ్వర్ అన్నారు. ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య (డబ్ల్యూ.ఎఫ్.టి.యు) 75 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని.. ఏఐటీయూసీ, సీఐటీయూ , ఏఐయూటియూసి ఆధ్వర్యంలో హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని ఎస్‌ఎన్‌రెడ్డి భవన్‌లో "సామాజిక న్యాయం కోసం దోపిడి - సమాజాల అంతం కోసం పోరాటం" అనే అంశంపై సదస్సు నిర్వహించారు.
సామాజిక సమన్యాయం, అంతరాలులేని నవీన సమాజ నిర్మాణం కోసం కార్మికవర్గం సమరశీల పోరాటాలు సాగించాలని నాగేశ్వర్ పిలుపునిచ్చారు. పెట్టుబడికి శ్రమకు మధ్య పోరాటం జరుగుతుందని.. పెట్టుబడే పైచేయి సాధించబోతుందని... దీన్ని ప్రతిఘటించేందుకు కార్మికవర్గం ఐక్యంగా ఉద్యమించాలన్నారు. నూతన పారిశ్రామిక విధానం వల్ల కార్మికవర్గం హక్కులు హరించబడుతున్నాయన్నారు. కార్మికులకు సామాజిక భద్రత లేకుండా చేస్తుందని విమర్శించారు. ఆర్థిక సంక్షోభాన్ని, శ్రమదోపిడిని అధిగమించడానికి విజయవంతమైన పోరాటాలు సాగించాలని విజ్ఞప్తి చేశారు.