బోస్టన్ నివేదికపై మీ అభిప్రాయం ఏంటి ?
వికేంద్రీకృత అభివృద్ధికి విస్తరణ రాజధానులు ఉండటం మంచిదంటూ విశాఖపట్నం, అమరావతి, కర్నూలు నగరాలను జీఎన్‌రావు కమిటీ ప్రతిపాదించింది. కొద్దిగా అటూ ఇటూ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) అవే అంశాలను చెప్పింది. బోస్టన్ గ్రూప్ వివరాలను విలేకరులకు వెల్లడించిన ప్రణాళిక శాఖ కార్యదర్శిని.. ఈ రెండు కమిటీలు పరస్పరం మాట్లాడుకున్నాయా అని విలేకరులు అడిగితే.. రెండింటికీ సంబంధమే లేదని, ఒక కమిటీ నివేదిక మరో కమిటీకి తెలియదని అన్నారు. అలాగైతే.. 99 శాతం ఒకే రకమైన నివేదికను ఎలా ఇస్తాయి? ఏపీ ముఖ్యమంత్రి రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలించాలని అనుకున్నారు. విశాఖపట్నాన్ని పాలన కేంద్రంగా సూచించడం రాజకీయ నిర్ణయమే. ఇందులో మరే హేతుబద్ధతా లేదు. హైదరాబాద్ అనుభవం పునరావృతం కాకుండా.. ఏపీలో రాజధాని వికేంద్రీకరణ జరగాలన్నారు. రెండు ఆప్షన్లు ఇచ్చి.. మళ్లీ అన్నీ విశాఖపట్నంలో పెట్టాలని చెప్పారు. సీఎం కార్యాలయం, సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, అత్యవసర సమావేశాల కోసం శాసనసభ, హైకోర్టు బెంచ్.. ఇవన్నీ విశాఖలో పెడితే దాదాపు అన్నీ వచ్చినట్లే కదా? ఇంకేం మిగులుతాయి? అమరావతిలో ఒక హైకోర్టు బెంచ్, అసెంబ్లీ.. కర్నూలులో హైకోర్టు తప్ప రాజధానికి సంబంధించినవి 90 శాతం విశాఖపట్నంలో ఏర్పాటుచేయడం శ్రేయస్కరమని బీసీజీ చెబుతోంది. చేస్తున్న వాదన ఒకటి. చేసిన సూచన మరోటి. ఇదే నివేదికలో విశాఖపట్నం అన్నిరకాలుగా అభివృద్ధి చెందిన నగరమని చెబుతున్నారు. అక్కడ రాజధాని పెడితే అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా అవుతుంది?
గ్రీన్‌ఫీల్డ్ నగరాలు విజయవంతం కాలేదని కమిటీ అంటోంది. మీరేమంటారు ?
గ్రీన్‌ఫీల్డ్ రాజధానులు ప్రపంచంలో ఎక్కడా విజయవంతం కాలేదంటున్నారు. వాటి గురించి అధ్యయనం చేయాలి. అయితే మిగిలినవాటితో అమరావతిని పోల్చలేం. విజయవాడ, గుంటూరు నగరాలు దాదాపు కలిసిపోయాయి. వాటికి అనుబంధంగా అమరావతి వస్తోంది. తెనాలి, మంగళగిరి వంటి పట్టణాలతో కలిపి మహానగరం అయ్యేది. ఈ విషయాలపై బోస్టన్ సంస్థ లోతైన అధ్యయనం చేసిందా అన్న అనుమానం ఉంది.
బహుళ రాజధానులతో ప్రయోజనముందా ?
బహుళ రాజధానులున్న దక్షిణాఫ్రికా, ఇతర దేశాలకు లాభం జరిగిందా.. లేదా అన్న విషయాన్ని కమిటీ ఎక్కడా విశ్లేషించలేదు. దక్షిణాఫ్రికా, జర్మనీ లాంటి దేశాలకు రెండు, మూడు రాజధానులున్నాయి. అయితే ఆ నిర్ణయం వెనుక చారిత్రక కారణాలున్నాయి. దశాబ్దాల పాటు రెండు దేశాలుగా ఉన్న జర్మనీ ఒక్కటైంది. కొన్ని రాష్ట్రాలు, బ్రిటిష్ పాలన కింద ఉన్న వివిధ కాలనీలు కలిసి దక్షిణాఫ్రికా ఏర్పడింది. అలాంటి నేపథ్యం ఆంధ్రప్రదేశ్‌కు లేదు కదా? బహుళ రాజధానులతో దక్షిణాఫ్రికా, జర్మనీలకు లాభం జరిగిందా.. నష్టమా? అన్నదానిపై బోస్టన్ సంస్థ విశ్లేషించిందా? 2016లో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్‌జూమా పార్లమెంటులో మట్లాడుతూ.. బహుళ రాజధానులు భారం, ఒక్క రాజధాని చాలన్నారు. విశాఖను పాలన కేంద్రంగా చేస్తే కొన్ని జిల్లాలకు దూరం అవుతుందన్న వాదన ఉంది. చెన్నై, బెంగళూరు, ముంబయి వంటి రాజధానులు ఆ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలకు దూరంగానే ఉన్నాయి. ఇది ప్రధానాంశం కాదు.