ఏపీ ప్రభుత్వం కడపలో ఏర్పాటు చేయతలపెట్టిన భారీ ఉక్కు కర్మాగారానికి భాగస్వామిగా ఎంపికైన లిబర్టీ స్టీల్స్ సంస్థ ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయింది. ఇది పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. కడప కర్మాగారం కోసం తొలిదశలోనే రూ.10 వేల కోట్ల పెట్టుబడి పెట్టాల్సిన గ్రూపు ఇలా ఆర్థిక సమస్యల్లో ఉంటే ప్రాజెక్టును ఎలా ముందుకు తీసుకెళ్తుందన్న సందేహం వ్యక్తమవుతోంది. లిబర్టీ గ్రూపు బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తోంది. లిబర్టీ స్టీల్స్ యాజమాన్య సంస్థ అయిన ‘గుప్తా ఫ్యామిలీ గ్రూప్ (జీఎఫ్జీ) అలయెన్స్’కు ప్రధాన రుణదాత అయిన ‘గ్రీన్‌సిల్ కేపిటల్’ బ్రిటన్‌లో ఈ నెల 8న దివాలా పిటిషన్ దాఖలు చేయడంతో లిబర్టీ వ్యవహారాలపై చర్చ మొదలైంది. జాతీయ, అంతర్జాతీయ మీడియాలో దీనిపై వరుస కథనాలు వస్తున్నాయి.
తాను ఎక్కువగా రుణాలిచ్చిన జీఎఫ్జీ గ్రూపు నుంచి వాయిదాల వసూళ్లు ఆగిపోయాయని, ఆ గ్రూపు ఆర్థికంగా తీవ్ర కష్టాల్లో ఉందని ‘గ్రీన్‌సిల్’ తన దివాలా పిటిషన్లో పేర్కొన్నట్లు ‘రాయిటర్స్’ పేర్కొంది. గ్రీన్‌సిల్ నుంచి తనకు నిధులు ఆగిపోతే తాను దివాలా తీసే పరిస్థితి ఉందని జీఎఫ్జీ ఫిబ్రవరిలో తెలిపినట్లు కూడా ఆ పిటిషన్లో ఉందని, జీఎఫ్జీ గ్రూపు గ్రీన్సిల్కు దాదాపు 4.15 బిలియన్ డాలర్ల (రూ.30,187 కోట్లు) బకాయి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ పరిణామాలతో లిబర్టీ గ్రూపు ఉక్కు కర్మాగారాలున్న బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా లాంటి దేశాలు అప్రమత్తమయ్యాయి. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కార్యాలయం లిబర్టీ స్టీల్స్‌తో నిరంతరం చర్చిస్తోంది. గ్రీన్‌సిల్ సంస్థ ఆర్థిక ఇబ్బందులు జీఎఫ్జీ కర్మాగారాలను, కార్మికులను సమస్యల్లోకి నెడితే వారికి తాము సాయం చేస్తామని ఫ్రాన్స్ మంత్రి బ్రూనో లీ మెయిరే ప్రకటించారు. ఆస్ట్రేలియాలోనూ జీఎఫ్జీ గ్రూపునకు ఒక ఉక్కు కర్మాగారం ఉంది. తాజా పరిణామాలను పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్నామని ఆ దేశ పరిశ్రమల మంత్రిత్వశాఖ పేర్కొంది. గ్రీన్‌సిల్ కష్టాలు తమకు సంక్షిష్ట పరిస్థితిని సృష్టించినా.. ప్రస్తుత అవసరాలకు తగిన నిధులు తమవద్ద ఉన్నాయని జీఎఫ్జీ ఒక ప్రకటనలో పేర్కొంది. రుణాల కోసం ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నామని, ఇందుకు కొంత సమయం పడుతుందని ఆ ప్రకటనలో గ్రూపు పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ కింకర్తవ్యం?
కడపలో 30 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఉక్కు కర్మాగారం తొలిదశ నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 25వేల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ప్రభుత్వం తరఫున ఇందుకోసం ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్‌ను ఏర్పాటుచేశారు. దీనికి 3,275 ఎకరాల భూమిని కేటాయించారు. కర్మాగారానికి ఇనుప ఖనిజం సరఫరాకు కేంద్రప్రభుత్వ సంస్థ ఎన్ఎండీసీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రైవేటు భాగస్వామి ఎంపికకు ముందే 2019 డిసెంబరు 23న కర్మాగారం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కడప ఉక్కు సంయుక్త భాగస్వామి సంస్థగా లిబర్టీ స్టీల్ ఇండియా ఎంపికను ఆమోదిస్తూ గతనెల 23న జరిగిన మంత్రివర్గ సమావేశం తీర్మానించింది. తమకు వచ్చిన ప్రతిపాదనల్లో ఎస్బీఐ క్యాప్ సిఫారసు మేరకు లిబర్టీ సంస్థను ఎంపిక చేసినట్లు ప్రకటించింది. కర్మాగార నిర్మాణానికి తొలిదశలో రూ.10,082 కోట్లు, రెండోదశలో రూ.6వేల కోట్లు ఖర్చు కానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పోటీలో ఉన్న ఇతర సంస్థలు, వాటితో పోలిస్తే లిబర్టీకి ఉన్న సానుకూలతలు ఏంటన్నది ప్రభుత్వం వెల్లడించలేదు. లిబర్టీ గ్రూపు వివిధ దేశాల్లో నడుపుతున్న కర్మాగారాల పరిస్థితిపై అక్కడి ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్న తరుణంలో కడప ఉక్కు కర్మాగారంపై లిబర్టీ గ్రూపు వేల కోట్లు ఖర్చు పెట్టగలదా అనే సందేహం వస్తోంది. ప్రభుత్వం లిబర్టీ గ్రూపుతోనే ముందుకు వెళ్తుందా లేదా ప్రత్యామ్నాయం అన్వేషిస్తుందా అనేది వేచిచూడాలి.