తెలంగాణ

telangana

ETV Bharat / city

'దేశ భక్తుల పురిటిగడ్డ ఆంధ్రప్రదేశ్​.. అల్లూరి స్ఫూర్తిని కొనసాగించాలి' - ఏపీలో ప్రధాని మోదీ

Modi About Alluri : ఆంధ్రప్రదేశ్ దేశభక్తుల పురిటిగడ్డ అని, అల్లూరి స్ఫూర్తితో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని.. 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. సభా ప్రాంగణం నుంచే వర్చువల్‌ విధానంలో విగ్రహావిష్కరణ చేసిన అనంతరం మాట్లాడారు. ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించిన మోదీ.. మన్యం వీరుడికి ఘనంగా నివాళులర్పించారు.

'దేశ భక్తుల పురిటిగడ్డ ఆంధ్రప్రదేశ్​.. అల్లూరి స్ఫూర్తిని కొనసాగించాలి'
'దేశ భక్తుల పురిటిగడ్డ ఆంధ్రప్రదేశ్​.. అల్లూరి స్ఫూర్తిని కొనసాగించాలి'

By

Published : Jul 4, 2022, 1:26 PM IST

Updated : Jul 4, 2022, 2:03 PM IST

దేశ భక్తుల పురిటిగడ్డ ఆంధ్రప్రదేశ్​.. అల్లూరి స్ఫూర్తిని కొనసాగించాలి

Modi About Alluri : "అల్లూరి తెలుగు జాతి యుగపురుషుడు. యావత్‌ భారతావనికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన అల్లూరి జయంతి రోజున మనందరం ఇక్కడ కలుసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రం పుణ్యభూమి.. వీరభూమి.. ఇలాంటి పుణ్యభూమికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. యావత్‌ భారత్‌ తరఫున అల్లూరి పాదాలకు వందనం చేస్తున్నా. అల్లూరి కుటుంబంతో వేదిక పంచుకోవడం నా అదృష్టం. దేశం ఇప్పుడు 75వ స్వాతంత్య్ర ఉత్సవాలను జరుపుకుంటోంది. రంప ఆందోళన ప్రారంభించి నేటికి వందేళ్లు పూర్తయింది. ఇలాంటి సమయంలో మన్యం వీరుడి 125వ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉంది.

శౌర్యానికి ప్రతీక అల్లూరి : ఆదివాసీల శౌర్యం, ధైర్యానికి ప్రతీక అల్లూరి సీతారామరాజు. అల్లూరి జీవన ప్రస్థానం మనందరికీ స్ఫూర్తిదాయకం. "మనదే రాజ్యం" నినాదంతో ప్రజలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చిన ఘనత అల్లూరిది. మన్యం వీరుడిగా ముందుకొచ్చి ఆంగ్లేయులతో వీరోచితంగా పోరాడారు. ఆనాడు ఆంగ్లేయులకు ఎదురొడ్డి ఎందరో యువకులు పోరాడారు. నేడు.. దేశాభివృద్ధిలో సైతం యువత భాగస్వామ్యం మరింత పెరగాలి.

ఆంధ్ర త్యాగ ధనులకు నమస్కరిస్తున్నా:ఆంధ్ర రాష్ట్రం ఎందరో దేశభక్తులకు పురుడు పోసిన గడ్డ. పింగళి వెంకయ్య, కన్నెగంటి హనుమంతు, పొట్టి శ్రీరాములు, వీరేశలింగం పంతులు వంటి మహానుభావులను కన్న భూమి ఆంధ్రప్రదేశ్‌. దేశం కోసం బలిదానం చేసిన ఇలాంటి వారి కలలను సాకారం చేయాలి. ఈ బాధ్యత అందరిపైనా ఉంది. దేశ చరిత్రలో అనాదిగా ఒకే దేశం, ఒకే భావన భాగమై ఉంది. ఆ భావనతోనే ఎందరో మహానుభావులు దేశం కోసం త్యాగం చేశారు. అలాంటి త్యాగధనులను నిరంతరం స్మరించుకుని ముందుకెళ్లాలి. వారి స్వాతంత్య్ర పోరాట పటిమ గురించి అందరికీ తెలియాలి. ఆ స్ఫూర్తికోసమే ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలు జరుపుకుంటున్నాం.

ఆదివాసీల అభివృద్ధికి చర్యలు:ఆదివాసీలతో పాటు యువకులు, మహిళలకు సమాన అవకాశాలు కల్పించేందుకు.. గడిచిన 8 ఏళ్లలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. రైతులను అన్నివిధాలుగా ఆదుకుంటున్నాం. మహనీయుల కల సాకారానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. "స్కిల్‌ ఇండియా" కింద యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. మన ఉత్పత్తులు అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా దృష్టి సారించాలి. అటవీ ప్రాంతంలో పెరుగుతున్న వెదురు కోతకు అవకాశం కల్పించాం. అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించాం. ఆదివాసీలకే హక్కు కల్పించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అల్లూరి మెమోరియల్ ఏర్పాటు:వెనుకబడిన జిల్లాల అభివృద్ధిలో భాగంగా మన్యం జిల్లాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. మాతృభాషలో విద్య కోసం 750 ఏకలవ్య పాఠశాలలు ఏర్పాటయ్యాయి. అల్లూరి మెమోరియల్‌ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నాం. దేశంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. సమస్యలపై పోరాడే తత్వం అల్లూరి నుంచి నేర్చుకోవాలి. అల్లూరి 125వ జయంతి సందర్భంలో వారి స్ఫూర్తితో ముందుకెళ్లాలి. అల్లూరి స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్తే మనల్ని ఎవరూ ఆపలేరు" అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. అంతకు ముందు అల్లూరి సీతారామరాజు కుటుంబసభ్యులను ప్రధాని సత్కరించారు.

ఇవీ చదవండి:

మోదీ జీ.. కేసీఆర్‌ ప్రశ్నలకు సమాధానాలేవీ? : తలసాని

'అగ్నిపథ్'​పై వచ్చే వారం సుప్రీం విచారణ

Last Updated : Jul 4, 2022, 2:03 PM IST

ABOUT THE AUTHOR

...view details