President hyderabad tour: ప్రతి ఏడాది శీతాకాలంలో భారత రాష్ట్రపతి దక్షిణాది విడిది కోసం హైదరాబాద్ రావడం ఆనవాయితీ. డిసెంబర్ మూడు లేదా నాలుగో వారంలో ఇక్కడకు వచ్చి వివిధ ప్రాంతాల్లో పర్యటించడం.. కార్యక్రమాల్లో పాల్గొంటారు. బొల్లారంలో 90 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో దక్షిణాది విడిది సందర్భంగా బస చేస్తుంటారు. నిరుడు కొవిడ్ కారణంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శీతాకాల విడిదికి రాలేదు. ఈసారి మాత్రం దక్షిణాది విడిదికి రాష్ట్రపతి వస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. ఈ మేరకు రామ్నాథ్ కోవింద్ పర్యటన ఖరారైంది.
ఘనస్వాగతానికి ఏర్పాట్లు..
ramnath kovind hyderabad tour: దక్షిణాది విడిది కోసం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ నెల 29న రాష్ట్రానికి రానున్నారు. వచ్చే నెల మూడో తేదీ వరకు ఇక్కడి రాష్ట్రపతి నిలయంలో విడిది చేయనున్నట్లు సమాచారం. కొత్త ఏడాది వేడుకలను కూడా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దక్షిణాదిలోనే జరుపుకోనున్నారు. రాష్ట్రపతి పర్యటన కోసం అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. సాధారణ పరిపాలనా శాఖ ప్రోటోకాల్ విభాగం తరఫున పనులు వేగవంతం చేశారు. దేశ ప్రథమ పౌరుడికి ఘన స్వాగతం పలికేందుకు సాధారణ పరిపాలన శాఖ ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఇప్పటికే బొల్లారం రాష్ట్రపతి నిలయంలో అధికారులు ఒక దఫా సమావేశమయ్యారు. సంబంధిత శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, మిలటరీ అధికారులతో త్వరలోనే సమన్వయ సమావేశం నిర్వహించనున్నారు. ఆక్టోపస్ విభాగం రాష్ట్రపతి నిలయంలో మాక్ డ్రిల్ కూడా నిర్వహించింది. ఎటువంటి విపత్కర పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కసరత్తు ద్వారా సందేశం ఇచ్చింది.