తెలంగాణ

telangana

ETV Bharat / city

Preparation Strategy for TSPSC: విశ్లేషించి చదివితే.. విజయం నీదే.!

Preparation Strategy for TSPSC: రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఏళ్ల తరబడిగా ఎదురుచూస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్లకు త్వరలో తెరపడనుంది. పోటీ పరీక్షల కోసం ఇప్పటికే ఎంతో మంది సన్నద్ధమవుతూ ఉన్నారు. మరికొందరు సన్నద్ధతపై ప్రణాళికలు రచించుకుంటున్నారు. ఈ క్రమంలో అసలు టీఎస్‌పీఎస్‌సీ సిలబస్‌ ఎలా ఉంటుంది.? ఏయే అంశాలపై పట్టు సాధించాలి.? ఎలా చదవాలి.. అనే వాటిపై అభ్యర్థులకు పలు సూచనలు ఇచ్చారు టీఎస్‌పీఎస్‌సీ సిలబస్‌ కమిటీ సభ్యుడు ప్రొ. చింతా గణేశ్‌.

TSPSC
టీఎస్‌పీఎస్సీ

By

Published : Mar 29, 2022, 7:59 AM IST

Preparation Strategy for TSPSC: ఒకవైపు సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల స్థాయి.. మరోవైపు దేశ, రాష్ట్రాలకు సంబంధించి అన్ని అంశాలపై సమగ్ర అవగాహన కలిగి ఉండేలా పోటీ పరీక్షల సిలబస్‌కు రూపకల్పన చేసినట్లు టీఎస్‌పీఎస్‌సీ సిలబస్‌ కమిటీ సభ్యుడు ప్రొ.చింతా గణేశ్‌ పేర్కొన్నారు. ప్రతి అంశంపై లోతైన విశ్లేషణతో చదువుకుంటే పరీక్షలలో విజయం సాధించడం సులభమని వివరించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సిలబస్‌ను మార్చేందుకు ప్రభుత్వం నియమించిన కమిటీలో ఆయన సభ్యుడిగా వ్యవహరించారు. ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌గా ఉన్నారు. పోటీ పరీక్షల సిలబస్‌ తీరుతెన్నులు, ప్రణాళిక, ప్రశ్నపత్రాల సరళి వంటి అంశాలపై ‘ఈనాడు-ఈటీవీ భారత్’కి ఇచ్చిన ముఖాముఖిలో మాట్లాడారు.

  • పోటీ పరీక్షల సిలబస్‌లో ఏయే మార్పులు తీసుకువచ్చారు?

ఒక పరిపాలనాధికారిగా నియమితులయ్యే వ్యక్తికి దేశంతో పాటు రాష్ట్రంలోని అన్ని అంశాలపై సమగ్రమైన అవగాహన ఉండాలనే ఉద్దేశంతో సిలబస్‌ రూపకల్పన చేశాం. జాతీయ స్థాయిలో జరిగే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షకు సరిసమానంగా ఉంటుంది. ప్రతి సబ్జెక్టులో లోతైన అవగాహన తెచ్చుకుంటేనే సరైన సమాధానాలు రాయడం వీలవుతుంది. సామాజిక సమస్యలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, వివిధ వర్గాల అభివృద్ధికి అనుసరిస్తున్న విధానాలు, దేశ సంస్కృతి, చరిత్ర, జాతీయోద్యమం, తెలంగాణ చరిత్ర-సంస్కృతి, రాష్ట్ర సాధన ఉద్యమం, దేశంలోని రాజకీయ, పరిపాలన, రాజ్యాంగం, ఆర్థిక రంగం, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, దేశ, రాష్ట్రాల భౌగోళిక స్వరూపానికి సంబంధించిన అంశాలు.. ఇలా అన్నింటితో సిలబస్‌ ఉంటుంది.

  • ప్రశ్నపత్రాలెలా ఉండొచ్చు?

గ్రూప్‌-1 ప్రిలిమినరీ, గ్రూప్‌-2, 3 సహా వివిధ పోటీ పరీక్షలు ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి. లోతైన పరిజ్ఞానంతోనే జవాబు తెలుసుకునేలా ప్రశ్నల సరళి ఉండే వీలుంది. దాదాపు 11 నుంచి 12 అంశాలపై సివిల్స్‌ స్థాయిలో ప్రశ్నావళి ఉంటుంది. సబ్జెక్టులతో పాటు రీజనింగ్‌, మెంటల్‌ ఎబిలిటీ, జనరల్‌ ఇంగ్లిష్‌లో ప్రశ్నలు ఉంటాయి. గ్రూప్‌-1 మెయిన్‌లో సమకాలీన సమాజంపై ప్రభావం, భవిష్యత్తులో మార్పులపై విశ్లేషించేలా ప్రశ్నలు వచ్చే వీలుంది.

  • సిలబస్‌ తగ్గట్టుగా ఎలాంటి పుస్తకాలు, స్టడీ మెటీరియల్‌ రిఫర్‌ చేయాలి?

మార్కెట్‌లో లభించే గైడ్లు కాకుండా సబ్జెక్టు నిపుణులను సంప్రదించి సిలబస్‌ను ముందు పెట్టుకుని.. దానికి తగ్గ ప్రామాణిక పుస్తకాలు చదివితే విజయం సాధించవచ్చు. ఉదాహరణకు జాతీయోద్యమంపై బిపిన్‌ చంద్ర, మధ్య యుగంపై సతీష్‌చంద్ర, భారత రాజ్యాంగంపై డీడీ బసు, భారత ఆర్థిక వ్యవస్థపై మిశ్రా అండ్‌ పూరి, దత్‌ అండ్‌ సుందరం, సోషల్‌ పాలసీలపై రామ్‌అహుజ పుస్తకాలు ప్రామాణికంగా ఉన్నాయి. వీటితోపాటు ఇండియా ఇయర్‌ బుక్‌, ఎకనామిక్‌ సర్వే రిపోర్టు, ప్రతియోగిత దర్పణ్‌, సివిల్‌ సర్వీసెస్‌ క్రానికల్‌, యోజన జర్నల్స్‌ చదవాలి.

  • నోట్స్‌ తయారీలో ఎలాంటి మెలకువలు అవసరం?

ప్రతి సబ్జెక్టులోని అంశాలు చదువుతూ నోట్స్‌ సిద్ధం చేసుకోవాలి. పరీక్ష దగ్గరికి వచ్చాక ఆయా అంశాలు రిఫర్‌ చేసుకుంటే సరిపోతుంది. నోట్స్‌ చిన్న పాయింట్లలో ఉండాలి. ఒక వాక్యం చదివితే నాలుగు వాక్యాలు రాసేలా ఉండాలి.

  • వ్యాస రచనలో దృష్టి పెట్టాల్సిన అంశాలేవి?

గ్రూప్‌-1లో వ్యాసరచన కీలకం. పరిచయం, అంశాల విశ్లేషణ, తార్కిక(లాజికల్‌) ముగింపు కోణంలో రచన ఉండాలి. నిత్యం రాయడం అభ్యాసం(ప్రాక్టీసు) చేయాలి. వివిధ అంశాలపై వ్యాసాలు రాసి నిపుణులతో దిద్దించాలి. భాష సరళంగా అర్థవంతంగా ఉండాలి. చేతిరాత చక్కగా ఉండాలి.

  • స్టడీ ప్లాన్‌ ఇలా ఉంటే మేలు

*ప్రతి అభ్యర్థి అంకితభావం, నిర్దేశిత ప్రణాళికతో రోజుకు 8 గంటలు(ఉదయం ఓ సబ్జెక్టు, సాయంత్రం మరో సబ్జెక్టు/4 గంటల చొప్పున) చదవాలి.
*ప్రతి 15 రోజులకోసారి సబ్జెక్టులు పూర్తి చేసుకుంటూ.. వర్తమాన, శాస్త్ర-సాంకేతిక అంశాలపై రోజూ పట్టు సాధించాలి.
*ప్రశ్నలు ఎలా అడిగే అవకాశం ఉందో అంచనా వేసుకుని నిశితంగా చదవాలి.
*కరెంటు అఫైర్స్‌కు సంబంధించి ఒకటి లేదా రెండు వార్తా పత్రికలను క్రమం తప్పక చదవాలి.

ఇదీ చదవండి:కేటీఆర్​ యూఎస్​ టూర్​.. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎన్నంటే?

ABOUT THE AUTHOR

...view details