తెలంగాణ

telangana

ETV Bharat / city

Chalo Vijayawada: ''చలో విజయవాడ' సక్సెస్​.. 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి' - PRC Sadhana Samithi Leaders

Leaders on Chalo Vijayawada Success: ఉవ్వెత్తున ఎగసిన ఉద్యోగుల ఉద్యమాన్ని చూసైనా ఏపీ ప్రభుత్వం తీరు మార్చుకోవాలని పీఆర్సీ సాధన సమితి నేతలు హితవు పలికారు. కొత్త పీఆర్సీ అమలుతో జీతాలు పెరిగాయంటూ.. మోసపూరిత మాటల్ని ప్రభుత్వం మానుకోవాలన్నారు. చర్చలతో డిమాండ్ల సాధనకు తాము ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని.. ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకుని ఆ దిశగా అడుగులు వేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 6 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తామని ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు.

Chalo Vijayawada Success
చలో విజయవాడ

By

Published : Feb 3, 2022, 4:12 PM IST

Chalo Vijayawada Success: ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు తలపెట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమం విజయవంతమైందని పీఆర్సీ సాధన సమితి నేతలు అన్నారు. ఈనెల 6 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం కల్పించిన అడ్డంకులను అధిగమించి వేలాదిగా ఉద్యోగులు విజయవాడకు తరలివచ్చారు. ‘చలో విజయవాడ’ ఆందోళనతో బెజవాడ వీధులు ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయాయి. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు.. ఎన్జీవో హోం నుంచి అలంకార్‌ థియేటర్‌ మీదుగా బీఆర్‌టీఎస్‌ కూడలి వరకు భారీ నిరసన ప్రదర్శన చేపట్టాయి.

మాట్లాడుతున్న ఉద్యోగ సంఘాల నేతలు

ఉద్యోగుల వేదన

'ఇది బలప్రదర్శన కాదు.. ఉద్యోగుల వేదనే చలో విజయవాడ' అని పీఆర్సీ సాధన సమితి సభ్యులు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. చలో విజయవాడ విజయవంతమైందని పేర్కొన్నారు. ఈనెల 6 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు బొప్పరాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఉద్యోగులందరికీ సాధన సమితి తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

'ప్రభుత్వంతో మేం ఘర్షణ వైఖరి కోరుకోవట్లేదు. గడిచిన కొన్నాళ్లుగా మీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. కమిటీలతో మేము ఇక చర్చించే ప్రశ్నే లేదు. సీఎంతో చర్చించే అవకాశం కల్పించకుండా అధికారులు మాయ చేశారు. ఈనెల 5 నుంచి పూర్తిగా సహాయ నిరాకరణ.. 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నాం. సమ్మెతో ప్రజలకు అసౌకర్యం కలిగితే ప్రభుత్వానిదే బాధ్యత. ఇలాంటి పీఆర్సీ ప్రకటించడం ఒక చరిత్ర. ఉద్యోగుల ఉద్యమం కూడా ఒక చరిత్రే. ప్రభుత్వం చెబుతుంది అన్నీ దొంగలెక్కలే. డిమాండ్లు నెరవేర్చేవరకు ఉద్యమం ఆగదు. ప్రభుత్వానికి ఇప్పటికైనా కనువిప్పు కలగాలి. - బొప్పరాజు వెంకటేశ్వర్లు

ప్రభుత్వం దిగివచ్చే వరకు ఉద్యమం కొనసాగిస్తాం: వెంకట్రామిరెడ్డి

పీఆర్సీ సాధన సమితి.. పీఆర్సీ డిమాండ్ల సాధన వరకే పరిమితం కాదని.. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసే వరకు సమితి పోరాడుతుందని స్పష్టం చేశారు. దీంతో పాటు ఆర్టీసీ కార్మికులు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు న్యాయం జరిగే వరకూ పీఆర్సీ సాధన సమితి పోరాడుతుందన్నారు.

ముఖ్యమంత్రి చర్చలకు పిలవాలి: బండి శ్రీనివాసరావు

ప్రభుత్వాధినేతగా ముఖ్యమంత్రి చర్చలకు పిలవాలని పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నామని.. సీఎం జగన్‌ నేరుగా చర్చించి న్యాయం చేయాలన్నారు. ఒప్పంద, పొరుగుసేవల సిబ్బంది జీతాలు పెంచాలన్నారు.

లెక్కల మాయాజాలం ఆపి వాస్తవాలను అంగీకరించాలి: సూర్యనారాయణ

దశాబ్ధాల తరబడి సాధించుకున్న ప్రయోజనాలను ఈ ప్రభుత్వం కాలరాసిందని ఉద్యోగ సంఘాల నాయకుడు సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇకనైనా మేల్కొని వితండవాదాన్ని వీడి.. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్​ చేశారు. నిన్నటిదాకా ఒక ఎత్తు, రేపటినుంచి మరో ఎత్తు చూస్తారని ప్రభుత్వాన్ని సూర్యనారాయణ హెచ్చరించారు. నిర్బంధాల మధ్య లక్ష మంది సభకు హాజరయ్యారు.. సూర్యనారాయణ చలో విజయవాడను విజయవంతం చేసిన ఉద్యోగులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

నినాదాలతో మార్మోగిన బీఆర్‌టీఎస్‌ రోడ్డు..

పీఆర్సీ జీవోలను రద్దు చేయాల్సిందేనంటూ ఉద్యోగులు చేస్తున్న నినాదాలతో బీఆర్‌టీఎస్‌ రోడ్డు మార్మోగింది. పీఆర్సీ జీవోలను రద్దు చేసే వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెప్పారు. ప్రభుత్వం తమను అణచివేసే ప్రయత్నాలు చేస్తే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుందని హెచ్చరించారు. హక్కుల సాధనకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. ‘వుయ్‌ వాంట్‌ జస్టిస్‌’.. ‘అర్ధరాత్రి ఇచ్చిన చీకటి జీవోలు రద్దు చేయాలి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

పోలీసుల కళ్లుగప్పి మారువేషాల్లో..

అంతకుముందు ‘చలో విజయవాడ’ను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. బారికేడ్లు పెట్టి ఉద్యోగులను అడ్డుకున్నారు. అయినప్పటికీ కొందరు ఉద్యోగులు మారువేషాల్లో విజయవాడ వెళ్లేందుకు యత్నించారు. నెల్లూరు రైల్వేస్టేషన్‌లో ఆత్మకూరు మండలానికి చెందిన ఓ ఉద్యోగి అంగవైకల్యం ఉన్న వ్యక్తి వలే మారు వేషంలో వెళ్తుండగా అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు ఉద్యోగులు కూలీల మాదిరిగా రైల్వే స్టేషన్లకు చేరుకున్నారు. వారిలో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మరికొందరు వారి కళ్లు గప్పి విజయవాడ చేరుకున్నారు.

ఇవీ చదవండి:Chalo Vijayawada Updates : నిర్భంధాలను ఛేదించుకుని విజయవాడకు ఉద్యోగులు

హైదరాబాద్ పర్యటనలో పీఎం మోదీ.. పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్న సీఎస్

ABOUT THE AUTHOR

...view details