తెలంగాణ

telangana

ETV Bharat / city

విధివంచితుల తలరాత మార్చిన.. ప్రమీలా సరాఫ్

శబ్దం... వినలేని వారికి ఈ పేరొక వరం.దృష్టి... చూడలేని వారికి ఇదో చుక్కాని.మనోవికాస్‌... విధివంచితుల తలరాత మార్చిన పేరది.నాలుగు దశాబ్దాలుగా వందలాది మంది దివ్యాంగుల భవిష్యత్తును నిర్దేశిస్తున్న ఈ పాఠశాలలు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త సౌకర్యాలతో, వినూత్న బోధనా పద్ధతులతో ముందడుగు వేస్తున్నాయి. దీని వెనక ఉన్న చోదక శక్తి పేరు ప్రమీలా సరాఫ్‌.

pramila saraf the woman behind manovikas
విధివంచితుల తలరాత మార్చిన.. ప్రమీలా సరాఫ్

By

Published : Dec 7, 2020, 10:41 AM IST

విజయనగరం జిల్లా... గరివిడి ఫేకర్‌ పరిశ్రమ సీఎండీ రామకృష్ణ సరాఫ్‌ సతీమణి ప్రమీలా సరాఫ్‌. దివ్యాంగులను చుట్టూ ఉన్న వారు చులకన చేసి మాట్లాడడం చూశారు. వారిపై అలాంటి భావాన్ని పోగొట్టాలని, దివ్యాంగులు ఎవరిపై ఆధారపడకుండా స్వయం సమృద్ధిని సాధించాలంటే అందుకు చదువు అవసరమని భావించారు. దివ్యాంగులకు ప్రత్యేకమైన పాఠశాలల ఏర్పాటుకు పూనుకుని 1980లో తొలిసారి వినికిడి లోపం ఉన్న పిల్లలకు విద్యనందించే ‘శబ్దం’ పాఠశాలను ప్రారంభించారు.

అక్కడ నుంచి ప్రమీల సేవలు దినదిన ప్రవర్థమానమయ్యాయి. ప్రత్యేక పాఠశాలలను విస్తరిస్తూ మానసిక వికలాంగుల కోసం ‘మనోవికాస్‌’, అంధత్వం ఉన్న పిల్లలకు ‘దృష్టి’ పాఠశాలలను నెలకొల్పారు. ఇవన్నీ అప్పటి నుంచి వందలాది మందిని తీర్చిదిద్దాయి. మారుతున్న పరిస్థితులకు, సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా మార్పులను ఆహ్వానిస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఉపాధ్యాయులను నియమించుకున్నారు. అంధ విద్యార్థులకు కంప్యూటరైజ్డ్‌ బ్రెయిలీ లిపి బోధనను ప్రవేశపెట్టారు. శబ్దంలో నవీన స్పీచ్‌ థెరపీతో బోధన చేస్తున్నారు. 1 నుంచి 10వ తరగతి వరకు దివ్యాంగులకు ఉచిత విద్యను అందించడమే కాదు విద్యార్థులకు చక్కని వసతి గృహం, భోజన సదుపాయాలు అన్ని ఉచితంగా కల్పిస్తున్నారు.

ఇక్కడ చదువుకుని బయటకు వెళ్లిన దివ్యాంగులకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించేందుకు స్విట్జర్లాండ్‌కు చెందిన రిహాస్విస్‌ సంస్థ ద్వారా ఆర్థిక పరమైన సహకారం అందించి వారంతా స్వయం సమృద్ధిని సాధించేలా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఈ పాఠశాలల్లో 75 మంది దివ్యాంగ బాలలున్నారు. ‘ఇక్కడి నుంచి బయటకెళ్లిన పిల్లలు మేం బాగున్నామని చెబుతుంటే అంతకన్నా ఆనందమేముంది’ అంటారు ఈ పాఠశాల రూపకర్త ప్రమీలా సరాఫ్‌.

ABOUT THE AUTHOR

...view details