హైదరాబాద్ నగర విద్యుత్తులో సగానికి పైగా పరిశ్రమలు, వాణిజ్య సంస్థలే వినియోగిస్తాయి. లాక్‌డౌన్‌తో ఇవన్నీ మూతపడ్డాయి. 24 గంటలు నడిచే పరిశ్రమలకు సైతం తాళాలు పడ్డాయి. నిర్మాణ రంగం నిలిచిపోయింది. ఐటీ సంస్థలు అత్యధికం పనిచేయడంలేదు. ఎక్కువమంది ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నారు. ఫలితంగా వినియోగం గతంలో ఎన్నడూ లేనంతగా పడిపోయింది. జనతా కర్ఫ్యూ విధించిన ఈనెల 22న 42 మిలియన్ యూనిట్ల దిగువకు పడిపోయింది.
దాదాపు 25 మిలియన్ యూనిట్ల..
ప్రస్తుతం అంతకంటే తక్కువ ఉంటోంది. గురువారం 37.4 మిలియన్ యూనిట్ల విద్యుత్తు మాత్రమే వినియోగించారు. గత ఏడాది మార్చి 26న 57.9 మిలియన్ యూనిట్ల వరకు కాల్చడం గమనార్హం. లాక్‌డౌన్‌తో ఏకంగా 20.5 మిలియన్ యూనిట్ల వాడకం తగ్గింది. వాస్తవంగా ఏటా వేసవిలో 10 శాతం వృద్ధి ఉంటుంది. ఆ రకంగా చూస్తే దాదాపు 25 మిలియన్ యూనిట్ల వినియోగం పడిపోయింది.
గృహ వినియోగంతోనే..
ప్రస్తుతం నగరంలో వినియోగిస్తున్న 37 మిలియన్ యూనిట్లలో 32 మి.యూనిట్ల వరకు గృహావసరాలదే. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో విద్యుత్తు వినియోగం స్వల్పంగా పెరిగింది. అలానే 5 మిలియన్ యూనిట్ల వరకు వాణిజ్య డిమాండ్ ఉంటుందని అంచనా. అత్యవసరంగా నడుస్తున్న ఆసుపత్రులు, సూపర్‌మార్కెట్లు, ఇతరత్రా కీలక పరిశ్రమల వినియోగంతోనే ఈ మేరకైనా నమోదవుతోందని అంటున్నారు. ఇప్పుడు ఏసీల వాడకమూ పరిమితంగా ఉంది. ఏప్రిల్‌లో ఎండలు ముదిరితే వీటి వినియోగం పెరిగే సూచనలున్నాయి.
ఎప్పుడూ ఇలా జరగలేదు..
ప్రకృతి విపత్తులు, ఈదురుగాలులతో విద్యుత్తు వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు మినహా జీహెచ్‌ఎంసీ పరిధిలో వెయ్యి మెగావాట్ల డిమాండ్ పడిపోవడం ఎప్పుడూ లేదు. సగం డిమాండ్ వాణిజ్య అవసరాలకే ఉంటుంది. లాక్‌డౌన్‌తో దుకాణాలు, హోటళ్లు, ఐటీ సంస్థలు, పరిశ్రమలన్నీ దాదాపు మూతపడడంతో డిమాండ్ తగ్గింది.
ఇవీ చూడండి:కరోనా కట్టడికి కొత్తనిర్ణయం... రాజధానిలో రెడ్జోన్లు