తెలంగాణ

telangana

ETV Bharat / city

'సస్పెన్షన్‌ ఒక్కటే మార్గమా? వేరే విభాగంలో పోస్టింగ్‌ ఇవ్వొచ్చు కదా?'

ఏపీకి చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ అంశంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ మే 3వ తేదీకి వాయిదా పడింది.

postponement-of-hearing-on-ips-officer-ab-venkateshwara-raos-suspension-in-supreme-court
'సస్పెన్షన్‌ ఒక్కటే మార్గమా? వేరే విభాగంలో పోస్టింగ్‌ ఇవ్వొచ్చు కదా?'

By

Published : Mar 9, 2021, 11:01 PM IST

ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌, ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏడాదికిపైగా సస్పెన్షన్‌ను పొడిగించడాన్ని సవాల్‌ చేస్తూ ఇటీవల ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. అవినీతి ఆరోపణలు లేనందున సస్పెన్షన్‌ను రివ్యూ కమిటీ ఏడాదికిపైగా పొడిగించడానికి వీల్లేదని ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది చందర్‌ ఉదయ్‌సింగ్, ఏబీ వెంకటేశ్వరరావు తరఫున ఆదినారాయణరావు వాదనలు వినిపించారు.

‘‘ఈ కేసులో సస్పెన్షన్‌ ఒక్కటే మార్గమా? వేరే విభాగంలో పోస్టింగ్‌ ఇవ్వొచ్చు కదా? ఒకే ఒక ఆరోపణపై నేరుగా సస్పెన్షన్‌ విధించడంలో అర్థమేంటి’’ అని ఏపీ ప్రభుత్వాన్ని జస్టిస్‌ ఖన్‌విల్కర్‌ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. ఆరోపణలు నిగ్గుతేల్చాక చర్యలు తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడింది. దీనిపై స్పందించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది.. ఆరోపణలపై దర్యాప్తు పూర్తిచేసేందుకు ఆరునెలల గడువు కోరారు. ఈ విషయంలో రోజువారీ దర్యాప్తు చేపట్టి ఎందుకు వెంటనే పూర్తిచేయలేరని.. ఒక సీనియర్‌ అధికారిని సస్పెండ్‌ చేసి దర్యాప్తు పూర్తిచేయకుండా ఎన్నాళ్లు గడువు తీసుకుంటారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రోజువారీ దర్యాప్తునకు తాము సిద్ధంగా ఉన్నామని.. కానీ ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా సస్పెన్షన్‌ను కొనసాగించాలని చూస్తోందని ఏబీ వెంకటేశ్వరరావు తరఫు న్యాయవాది ఆదినారాయణరావు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

మరోవైపు దర్యాప్తు అధికారిని నియమించినట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. ఈ వ్యవహారంపై రోజువారీ విచారణ చేపట్టి శాఖాపరమైన దర్యాప్తును ఏప్రిల్‌ 8లోపు పూర్తి చేయాలని.. మొత్తం విచారణను ఏప్రిల్‌ 30లోపు ముగించాలని ఆదేశించింది. దీనిపై సమగ్ర నివేదికను తదుపరి విచారణ తేదీలోపు ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను మే3కు వాయిదా వేసింది.

ఇదీ చదవండి:రాజధాని రైతులపై ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు

ABOUT THE AUTHOR

...view details