ప్రపంచవ్యాప్తంగా కాలుష్య తీవ్రత పెరుగుతుండడంతో బంగాళాఖాతానికీ ముప్పు తీవ్రత అధికమవుతోంది. ద్రావణాల పీహెచ్ (పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్) విలువ 0-14 వరకు ఉంటుంది. 0-7 వరకు ఉంటే ఆమ్లశాతం ఉన్నట్లుగానూ, 7-14 వరకు ఉంటే క్షారశాతం ఉన్నట్లుగా పేర్కొంటారు. సరిగ్గా 7 ఉంటే ఆమ్ల, క్షార లక్షణాలు సమపాళ్లలో ఉన్నట్లు పరిగణిస్తారు. ఆమ్లశాతం పెరిగితే సముద్రంలోని జీవరాశుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంటుంది. ఆమ్లశాతం పెరిగితే సముద్రంలో ఉండే ‘ఆల్గే’ అనే జీవజాతి నశించిపోతుంది. దాన్ని తిని బతికే ‘జూప్లాంక్టన్’ అనే జీవరాశి కూడా మనుగడ సాగించలేదు. ఫలితంగా ఆ రెండింటిపై ఆధారపడే మత్స్యసంపద, జీవసంపద మొత్తానికి ముప్పు వచ్చినట్లే.
కొరల్స్ కూడా కనుమరుగవుతాయి
కాలుష్యంతో సముద్ర అంతర్భాగాల్లో ఉండే కొరల్స్ కూడా కనుమరుగయ్యే అవకాశం ఉంది. సముద్రంలో ఉండే కాల్షియం అణువులు, బొగ్గుపులుసు వాయువుతో కలిసి కాల్షియం కార్బొనేట్ ఏర్పడుతుంది. అదే కొరల్స్‌గా కనువిందు చేస్తుంది. ఆమ్లశాతం పెరిగితే కొరల్స్ కూడా కరిగిపోయి అందులో ఉన్న బొగ్గుపులుసు వాయువు బయటకు వస్తుందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.