Police stop lokesh in Srikakulam: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో దిగి రోడ్డుమార్గంలో పలాస వెళ్తున్న ఆయనను శ్రీకాకుళం నగరం సమీపంలో హైవేపై అడ్డుకున్నారు. పోలీసుల వైఖరిపై తెదేపా శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కొత్తరోడ్డు కూడలి వద్ద తెదేపా ముఖ్యనేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. లోకేశ్ సహా మాజీ మంత్రులు కళా వెంకట్రావు, చినరాజప్ప, ఇతర నేతలు రోడ్డుపై నిరసనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు - తెదేపా శ్రేణుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో పలువురు కార్యకర్తలు, నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. లోకేశ్‌తో పాటు చినరాజప్ప, కళా వెంకట్రావు తదితరులను అదుపులోకి తీసుకుని ఎచ్చెర్ల సమీపంలోని జేఆర్ పురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అంతకుముందు శ్రీకాకుళం జిల్లా సరిహద్దుకు చేరుకున్న నారా లోకేశ్‌కు తెదేపా శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.
పలాసలో అసలేం జరుగుతోంది..?పలాస పరిధిలో భూకబ్జాలు, ఆక్రమణల అంశంలో తెదేపా-వైకాపా నేతలు గతకొద్ది రోజులుగా సవాళ్లు ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. రెండు రోజుల క్రితం రాత్రివేళ ఆక్రమణల పేరుతో తెదేపా నేతలతో పాటు ఇతరుల ఇళ్లను కూల్చేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. గురువారం రాత్రి చెరువులో ఆక్రమించి నిర్మించారంటూ పలాస 27వ వార్డు కౌన్సిలర్, తెదేపాకు చెందిన సూర్యనారాయణ ఇళ్లను కూలగొట్టేందుకు అధికారులు ప్రయత్నించడం, దానిని తెదేపా వారు అడ్డుకోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది.
మరోవైపు పలాసలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సీదిరి అప్పలరాజుపై తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ గౌతు శిరీష వ్యక్తిగత దూషణలు, అనుచిత వాఖ్యలు చేస్తున్నారని.. ఆమె ఈ నెల 18వ తేదీలోగా క్షమాపణ చెప్పకపోతే 21న తెదేపా కార్యాలయాన్ని ముట్టడిస్తామంటూ వైకాపా నాయకులు హెచ్చరించారు. ఆమె స్పందించకపోవడంతో వైకాపా నాయకులు ఆదివారం ఉదయం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు నిరసన కార్యక్రమం నిర్వహించి తెదేపా కార్యాలయాన్ని ముట్టడించేందుకు జనసమీకరణ చేస్తున్నారు. ప్రతిగా తాము పార్టీ కార్యాలయంలోనే ఉంటామని.. ఎలా ముట్టడిస్తారో చూస్తామని గౌతు శిరీష పేర్కొన్నారు. ముట్టడిని ఎదుర్కొనేందుకు పెద్దఎత్తున కార్యకర్తలు, అభిమానులు చేరుకోవాలని కోరారు. మరోవైపు తమ పార్టీకి చెందిన కౌన్సిలర్ సూర్యనారాయణను పరామర్శించేందుకు నారా లోకేశ్ పలాస పర్యటనకు బయల్దేరారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన పలాస వెళ్లకుండా శ్రీకాకుళం హైవేపై పోలీసులు అడ్డుకున్నారు.