అభంశుభం తెలియని విద్యార్థులను మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పోలీస్స్టేషన్లో ఉంచిన ఘటన ఏపీ పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో జరిగింది. పార్టీ ఫ్లెక్సీలను చించారని ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆ చిన్నారులను స్టేషన్కి తీసుకెళ్లారు. పోలీసులను చూసి భయపడిన చిన్నారులు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు బిక్కుబిక్కుమంటూ స్టేషన్లో గడిపారు. చివరకు స్థానిక నాయకుల పూచీకత్తుతో ఇంటికి పంపారు. పిల్లలను పోలీస్స్టేషన్లో ఉంచడంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు.
వైకాపా అరాచక పాలనకు నిదర్శనం...
ఆడుకుంటూ ఫ్లెక్సీ చింపారని విద్యార్థులను రోజంతా స్టేషన్లో ఉంచడం వైకాపా ప్రభుత్వ అరాచక పాలనకు అద్దం పడుతోందని లోకేశ్ మండిపడ్డారు. వైకాపా నాయకుల పైశాచికత్వానికి అడ్డుఅదుపు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టిన వైకాపా నేతలు, ఇప్పుడు ఏకంగా చిన్నారులను పోలీస్ స్టేషన్లో పెట్టి వికృత ఆనందం పొందుతున్నారని విమర్శించారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే పిల్లల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి బెదిరించడమా? అని నారా లోకేశ్ నిలదీశారు. బాలల హక్కులు కాలరాసే విధంగా చోటుచేసుకున్న ఈ ఘటన పై విచారణ జరిపి, విద్యార్థులను వేధించడానికి కారణమైన వైకాపా నేతలు, వారికి సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: తిరుపతిలో అమానవీయం..మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్న అంబులెన్స్ సిబ్బంది