దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేనివిధంగా కోర్టులో దొంగలు పడటం..అదీ ఓ కీలకమైన కేసులో ఆధారాలుగా ఉన్నపత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు దొంగిలించడంతో ఏపీలోని నెల్లూరు పోలీసులు ఉలిక్కిపడ్డారు. రాజకీయ ఆరోపణలు రావడంతో జిల్లా ఎస్పీ సీహెచ్ విజయారావు నేరుగా రంగంలోకి దిగి విచారణజరుపుతున్నారు. కీలకపత్రాలు ఎక్కడున్నాయి.? ఎక్కడి నుంచి దొంగిలించారనే వివరాలు తెలుసుకున్నారు. కేసు చిన్నబజారు పోలీసు స్టేషన్ పరిధిలోనిది కావడంతో ఇటీవల బదిలీపై వెళ్లిన ఇన్‌స్పెక్టరు మధుబాబును రంగంలోకి దించారు.
కోర్టు ఆవరణలో సీసీటీవీ కెమెరాలు లేకపోవడం వల్ల కేసును ఛేదించడం కష్టమైనా కోర్టుకు వెళ్లే దారిలోని సీసీ ఫుటేజీలను పరిశీలించగా ఇద్దరు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గుర్తించారు. బుధవారం అర్ధరాత్రి రెండు, మూడు గంటల మధ్యలో.... దొంగతనం చేసి ఉంటారని భావిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరూ పాత నేరస్థులేనని తెలుస్తోంది. రెండు నెలల కిందట రాయాజీవీధిలో జరిగిన ఓ చోరీ కేసులో వీరు నిందితులు. ఓ వృద్ధురాలిని కట్టేసి బంగారు నగలు దొంగిలించారు. అప్పట్లో వీరిపై దోపిడీ కేసు కాకుండా నామమాత్రపు కేసు నమోదు చేశారు. జైలు నుంచివిడుదలైన తర్వాత కోర్టులో దొంగతనం చేసినట్లు తెలుస్తోంది. బండిపై ఉల్లిపాయలు విక్రయించే వారిద్దరూ...స్నేహితులేనని సమాచారం. త్వరలోనే పోలీసులు కేసు పూర్వాపరాలు వెల్లడించే అవకాశం ఉంది.