Modi Speech in BJP Vijay Sankalpa Sabha: ఆవిష్కరణల్లో దేశంలోనే తెలంగాణ కేంద్రంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చి తీరుతుందని మోదీ దీమా వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే తెలంగాణలో సత్వర అభివృద్ధి జరుగుతుందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే ప్రతి పట్టణం, పల్లె అభివృద్ధి చెందుతాయని వివరించారు. తెలంగాణ ప్రజల ఆశీస్సుల కోసం వచ్చానన్న మోదీ.. రాష్ట్ర అభివృద్ధే భాజపా ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. భాజపాపై తెలంగాణ ప్రజలకు నమ్మకం పెరుగుతోందని.. డబుల్ ఇంజిన్ సర్కారు కోసం రాష్ట్ర ప్రజలు పట్టాలు వేస్తున్నారని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధికి అందిస్తోన్న సహకారాన్ని వివరించిన మోదీ.. పలు వరాలు సైతం కురిపించారు.
తెలుగులో ప్రసంగం..:సికింద్రాబాద్లో నిర్వహించిన భాజపా విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. కళాకారుల డప్పు చప్పుళ్లు, నృత్యాలతో భాజపా నేతలు స్వాగతం పలికారు. లక్షల మంది కార్యకర్తల హర్షధ్వానాల మధ్య వేదికపైకి వచ్చిన నరేంద్ర మోదీ.. అందరికి అభివాదం చేశారు. మోదీకి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శాలువా కప్పి.. సన్మానించారు. అనంతరం.. సభలో ప్రసంగించిన మోదీ.. మొదట్లో తెలుగులో మాట్లాడి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. "సోదర సోదరీమణులకు నమస్కారాలు. ఎంతోదూరం నుంచి వచ్చిన ప్రతి కార్యకర్తలకు అభినందనలు. తెలంగాణ నేలతల్లికి వందనం సమర్పిస్తున్నా. తెలంగాణ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.." అంటూ.. మోదీ తెలుగులో ప్రసంగించారు. అందుకు.. కార్యకర్తలు పెద్దఎత్తున హర్షధ్వానాలు చేశారు. మోదీ.. నినాదాలతో సభా ప్రాంగణాన్ని మారుమోగించారు.
తెలంగాణ పవిత్ర భూమి..:సభా ప్రాంగణాన్ని చూసి ఉప్పొంగిపోయిన మోదీ.. ప్రేమకు, అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ మొత్తం మైదానంలో కూర్చున్నట్లు ఉందన్నారు. తెలంగాణ గడ్డకు శిరసు వంచి నమస్కారించారు. ప్రాచీన సంస్కృతి, పరాక్రమానికి తెలంగాణ పురిటిగడ్డ అని కొనియాడారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, శిల్పకళ.. అందరికీ గర్వకారణమన్నారు. తెలంగాణ పవిత్ర భూమి అని.. దేశప్రజలకు యాదాద్రి, జోగులాంబ, భద్రకాళి ఆశీస్సులు ఉంటాయన్నారు. హైదరాబాద్ నగరం అన్నిరంగాల వారికి అండగా నిలుస్తోందన్నారు. తెలంగాణ ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను ఆదరించారని.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ పార్టీకి మంచి ఫలితాలు వచ్చాయని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలకు భాజపాపై నమ్మకం ఎన్నోరెట్లు పెరిగిందని స్పష్టం చేశారు. సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్.. మంత్రంతో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ అభివృద్ధే మా పార్టీ ప్రాధాన్యత..