వెంకట్రామిరెడ్డి రాజీనామాను (Venkatramireddy) ఆమోదించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలు అయింది. ఐఏఎస్ రాజీనామాను ఆమోదించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రీసెర్చ్ స్కాలర్ ఆర్.సుబేందర్ సింగ్, జె.శంకర్ వ్యాజ్యం దాఖలు చేశారు. ఐఏఎస్‌లు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటారని పేర్కొన్నారు. వెంకట్రామిరెడ్డి నామినేషన్‌ను ఆమోదించకుండా ఆదేశాలివ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈసీ, శాసనమండలి కార్యదర్శి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. పిల్‌ను లంచ్ మోషన్ స్వీకరించాలని సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి కోరారు. అత్యవసర విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిరాకరించింది.
అందుకే రాజీనామా
సోమవారం ఉదయం నేరుగా బీఆర్కే భవన్‌కు వెళ్లి సీఎస్ సోమేశ్‌కుమార్‌కు తన రాజీనామా (siddipet collector resigns) సమర్పించారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వస్తున్నట్లు వెంకట్రామి రెడ్డి ప్రకటించారు. రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టేలా తెరాస ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు తనను ఆకర్షించాయని ఆయన స్పష్టం చేశారు. తన సేవలు కేవలం ఒక జిల్లాకే పరిమితం కాకుండా రాష్ట్రం మొత్తానికి అందించాలన్న ఉద్దేశంతో ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డికి సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారు. మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు.