తెలంగాణ

telangana

Photo Expo: మది దోచుకుంటున్న ఛాయచిత్రాలు.. ఫొటోగ్రఫీలో రాణిస్తోన్న ఆణిముత్యాలు

సహజసిద్ధమైన ప్రకృతి అందాలు.... మగువల ముఖారవిందాలు... పక్షుల కిలకిల రాగాలు... పురాతన కట్టడాలు.... ఇలాంటి అద్భుతమైన చిత్రమాలికలు వీక్షకులను కట్టిపడేస్తున్నాయి. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో.... ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని.... ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఫోటోగ్రఫీరంగంలో రాణిస్తున్న వారు చిత్రీకరించిన ఆణిముత్యాలను ఈ ప్రదర్శనలో ఉంచారు.

By

Published : Aug 21, 2021, 4:25 AM IST

Published : Aug 21, 2021, 4:25 AM IST

Photo Expo in art gallery in hyderabad
Photo Expo in art gallery in hyderabad

జ్ఞాపకాలను పదికాలాలపాటు పదిలంగా ఉంచడంతోపాటు... భవిష్యత్‌ తరాలకు వాటి మాధుర్యాన్ని అందించగల గొప్పతనం ఫొటోగ్రఫీ సొంతం. మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలు... ఫోటో ద్వారా తెలుసుకుంటాం. మైమరిపించే ప్రకృతి సొయగాలు... పరవశింపజేసే పల్లె పడుచుల కట్టుబొట్టు... పురాతన సంప్రదాయాలను కళ్లముందుంచే ఛాయాచిత్రాలతో... హైదరాబాద్‌లో ప్రదర్శన ఏర్పాటైంది. మాదాపూర్‌లోని స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని... ఛాయాచిత్రాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను ఎమ్మెల్సీ సురభివాణీదేవి ప్రారంభించారు. 50 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఫోటోగ్రఫీ రంగంలో రాణిస్తున్న పలువురు చిత్రీకరించిన... 160 ఛాయచిత్రాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి.


మది దోచుకునే చిత్రాలు..

ప్రకృతి అందాలు, గిరిజన సంప్రదాయాన్ని తెలిపేలా ఉన్న ఫోటోలు ప్రదర్శనలో ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. పురాతన కట్టడాలు, పక్షులు, జంతువుల ఛాయాచిత్రాలు సందర్శకుల మది దోచుకుంటున్నాయి. గ్యాలరీలోని ఫోటోలన్నింటిని వీక్షించిన ఎమ్మెల్సీ సురభి వాణీదేవి చరిత్రకు సజీవ సాక్ష్యంగా ఫోటో ఉంటుందని పేర్కొన్నారు. నేటితరం యువత ఈ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు.

ఈ నెల 29 వరకు..

అద్భుతమైన చిత్రాలను బంధించిన ఫోటోగ్రాఫర్లకు... ఎమ్మెల్సీ సురభి వాణిదేవి ప్రశంస పత్రాలు అందించారు. ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తాము తీసిన ఫోటోలను ప్రదర్శనలో ఉంచడం సంతోషంగా ఉందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రదర్శనల ద్వారా ఫోటోగ్రఫీకి సంబంధించి మరిన్ని అంశాలు తెలుసుకునే అవకాశం కలుగుతుందన్నారు. ప్రదర్శనకు అధికసంఖ్యలో తరలివచ్చిన సందర్శకులు.... దాచుకున్న జ్ఞాపకాలను భవిష్యత్‌ తరాలకు తెలియజేసేలా ఛాయాచిత్రాలు ఉన్నాయని అంటున్నారు. ఈ ప్రదర్శన ఈ నెల 29 వరకు నగరవాసులకు అందుబాటులో ఉంటుందని నిర్వహకులు తెలిపారు.

ఇదీ చూడండి:

కాలం చెక్కిలిపై కెమెరా చెక్కిన జ్ఞాపకం..

ABOUT THE AUTHOR

...view details