Drunkard Hulchal: హైదరాబాద్ మలక్‌పేటలో డ్రంకన్ డ్రైవ్ నిర్వహిస్తుండగా.. ఓ దివ్యాంగుడు హల్చల్ చేశాడు. పోలీసులతో వితండవాదం చేస్తూ.. వారి విధులకు కాసేపు అంతరాయం కలిగించాడు. సోమవారం రాత్రి మలక్‌పేట ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా వాహనాలను ఆపి.. బ్రీత్ అనలైజర్‌తో పరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో అటువైపుగా వచ్చిన ఓ కారును నిలిపి తనిఖీ చేయగా.. నడిపిస్తోన్న యువకుడు మద్యం సేవించినట్లు తేలింది. అదే సమయంలో కారులో అతడి సోదరుడైన దివ్యాంగ వ్యక్తి కూడా మద్యం సేవించి ఉన్నాడు.
మద్యం మత్తులో కారు నడుపుతున్న వ్యక్తిని పోలీసులు విచారించి.. కారును స్వాధీనం చేసుకున్నారు. తర్వాతి రోజు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి.. జరిమానా చెల్లించి కారు తీసుకెళ్లాలని సూచించారు. అయితే.. దీనికి ఎంత మాత్రం ఒప్పుకోని దివ్యాంగ వ్యక్తి ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. దివ్యాంగుడినైన తనను ఎందుకు ఆపారంటూ.. హల్చల్ చేశాడు. ఎంత నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వినకుండా.. మద్యం మత్తులో వితండవాదం చేశాడు. అక్కడితో ఆగకుండా.. విధుల్లో ఉన్న పోలీసులను దుర్భాషతాడుతూ.. చొక్కా పట్టుకుని బెదిరించాడు. తనను ఆపినందుకు ప్రతిగా.. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ని వెళ్లనీయకుండా ద్విచక్రవాహనాన్ని అడ్డుకుని చాలాసేపు హంగామా చేశాడు. ఇలా చేయటం మంచి పద్దతి కాదని.. విధులకు ఆటంకం కలిగించటం శిక్షార్హమని ఎంత చెప్పినా వినకుండా నానా రచ్చ చేశాడు.