తెలంగాణ

telangana

ETV Bharat / city

మట్టి గణపయ్యా నీకే మా ఓటయ్యా..! - vinayaka

పండుగలు మన సంప్రదాయాలకు చిహ్నాలు. వేడుకలేవైనా మధుర జ్ఞాపకాలను పంచాలి కానీ భరించలేని హాలాహలాన్ని కాదు. అందుకే భాగ్యనగరవాసులు పర్యావరణహిత మంత్రం పఠిస్తున్నారు. వినాయక చవితి అర్థాన్ని, పరమార్థాన్ని తెలుసుకుని మట్టి గణపయ్యల వైపే మొగ్గుచూపుతున్నారు. ఇది దృష్టిలో పెట్టుకుని ఈసారి భారీ మొత్తంలో సహజ గణపయ్యలు సిద్ధమయ్యారు.

మట్టి గణపయ్యా నీకే మా ఓటయ్యా..!

By

Published : Aug 29, 2019, 10:04 AM IST

రుతువులకు అనుగుణంగా పండుగలు రూపొందించారు పూర్వీకులు. వాటి వెనుక దాగి ఉన్న ఉద్దేశం మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా పర్యావరణాన్ని కాపాడుకోవడం. భారతీయ సంప్రదాయ పండుగల్లో చిన్నా పెద్దా తేడాలేకుండా అందరూ జరుపుకునే పండుగ వినాయక చవితి. పండుగంటే ఇదేరా అన్నట్టుగా భాగ్యనగరంలో వినాయక చవితి ఉత్సవాలు జరుపుతారు. కొండంత దేవుడిగా.. కోరిన వరాలిచ్చే గణనాథుడిని పూజించేందుకు భాగ్యనగరవాసులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజల్లో సామాజిక చైతన్యం పెరిగి ఈసారి మట్టిగణపయ్యలకే ఓటేస్తున్నారు భక్తులు.

మట్టిగణపయ్య ప్రతిమనే కొందాం...

ప్లాస్టర్​ ఆఫ్​ పారిస్​తో తయారు చేసిన విగ్రహాలు పరోక్షంగా జల, వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయి. చెరువులు, కుంటల్లో హాలాహలం పేరుకుపోయి జలచరాల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. ఈ విషయంపై ఏటా స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం చేస్తున్న ప్రచారంతో ప్రజల్లో చైతన్యం వచ్చింది. గతంలో కంటే ఈసారి మట్టి విగ్రహాలు కొనేందుకే ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. హెచ్​ఎండీఏ, కాలుష్య నియంత్రణ మండలి, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ రాష్ట్ర కుమ్మరి వృత్తిదారులు సహా కొన్ని స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున మట్టివిగ్రహాలు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

వీరికి ఉపాధి... ప్రకృతికి మంచిది

మట్టి విగ్రహాలకు డిమాండ్​ పెరగడం వల్ల కులవృత్తులవారికి చేతినిండా పనిదొరికింది. ఇప్పటికే వేల సంఖ్యలో విగ్రహాలు తయారు చేసి అమ్మకానికి ఉంచారు. విగ్రహాల కొనుగోలు విషయంలో భక్తుల అభిప్రాయం మారుతోంది. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాల వైపే మొగ్గుచూపుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి మట్టి విగ్రహాలు కొనుగోలు చేస్తున్నారు.

వినూత్న ప్రచారం..

ప్రభుత్వంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా మట్టి గణపయ్యలపై పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాయి. వనస్థలిపురంలోని జాగృతి అభ్యదయ సంఘం సభ్యులు వినూత్న రీతిలో అవగాహన కల్పిస్తున్నారు. ఎన్నికల ప్రచారం తరహాలో చరవాణిలకు వాయిస్​ రికార్డింగ్​ పంపి అందరికీ తెలిసేలా చేస్తున్నారు.
ప్రకృతి కల నెరవేరతుంది

గడిచిన పదేళ్లలో మట్టి విగ్రహాల తయారీ గణనీయంగా పెరిగింది. గతేడాది సుమారు లక్ష వరకు ఆరడుగుల విగ్రహాలు విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే 60 నుంచి 70 వేల విగ్రహాలు విక్రయించారు. రికార్డు స్థాయిలో రెండు లక్షల మట్టి దేవుళ్లు పూజలందుకుంటారని అంచనా వేస్తున్నారు. చవితిని పర్యావరణ హితంగా జరుపుకునే వారి సంఖ్య పెరగాలని ప్రజలు, పర్యావరణ ప్రేమికులు ఆశిస్తున్నారు.

మట్టి గణపయ్యా నీకే మా ఓటయ్యా..!

ఇదీ చూడండి: మట్టి గణపయ్యలకు సై... పర్యావరణానికి జై!

ABOUT THE AUTHOR

...view details