Revanth Fires On KCR: ఉద్యోగుల బదిలీలు, కేటాయింపులకు సంబంధించిన జీవో నంబరు 317 రాజ్యాంగానికి విరుద్దమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆరోపించారు. ఉద్యోగుల బదిలీల్లో పాలకుల నిర్ణయాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేలా ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలోని ప్రజలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు.. ఎవరూ సంతోషంగా లేరన్నారు. అసలు ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా అన్న అసంతృప్తిలో ప్రజలున్నారని రేవంత్రెడ్డి చెప్పారు.
ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల్లో స్థానికత ప్రాధాన్యతగా ఉండాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లాను ఎన్ని జిల్లాలుగా విభజించినా పుట్టి పెరిగిన చోట ఉద్యోగం ఇవ్వాలని రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదన్న రేవంత్.. పాఠాలు చెప్పే ఉపాధ్యాయులనూ రోడ్డెక్కేలా చేశారని మండిపడ్డారు.
Revanth reddy on Teachers Transfers: ప్రధానోపాధ్యాయుడు బాణోత్ జేత్రాం.. సొంత జిల్లాలో ఉంచాలని కోరినా ములుగు జిల్లాకు బదిలీ చేశారని.. ఆ బాధను భరించలేక గుండెపోటుతో మరణించారని రేవంత్రెడ్డి ఆరోపించారు. ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. తనను ఎందుకు నిర్బంధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తప్పుడు నిర్ణయంతో ఓ ఉపాధ్యాయుడు మరణిస్తే.. విద్యాశాఖ మంత్రి కూడా పట్టించుకోలేదని రేవంత్రెడ్డి మండిపడ్డారు. కనీసం బాధిత కుటుంబాన్ని పరామర్శించాలన్న ఆలోచనా చేయడం లేదని ధ్వజమెత్తారు.