తెలంగాణ

telangana

ETV Bharat / city

REVANTH REDDY:'శ్రీకాంతాచారి స్ఫూర్తితో కాంగ్రెస్ ఉద్యమిస్తుంది' - తెలంగాణ కాంగ్రెస్​ వార్తలు

రాష్ట్రం, కేంద్రంలో కాంగ్రెస్​ పార్టీనే ప్రత్యామ్నాయమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. నిరుద్యోగ యువత, విద్యార్థి సమస్యలపై నిర్వహించిన జంగ్‌ సైరన్‌ సందర్భంగా జరిగిన ఉద్రిక్తతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్​ ఎల్బీనగర్‌లో శ్రీకాంతాచారి విగ్రహానికి రేవంత్‌రెడ్డి నివాళులు అర్పించారు. శ్రీకాంతాచారి స్ఫూర్తితో కాంగ్రెస్ ఉద్యమిస్తోందని తెలిపారు.

REVANTH
REVANTH

By

Published : Oct 3, 2021, 2:07 PM IST

Updated : Oct 3, 2021, 2:45 PM IST

ఆత్మబలిదానాలతో వచ్చిన తెలంగాణలో విద్యార్థులపై దాడులు చేయించి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ఆరోపించారు. శనివారం నిర్వహించిన నిరుద్యోగ, విద్యార్థి జంగ్​ సైరన్​లో సందర్భంగా పోలీసుల లాఠీఛార్జిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హుజూరాబాద్​ ఉపఎన్నిక కాంగ్రెస్​ అభ్యర్థి వెంకట్​ సహా ఇతర కార్యకర్తలను రేవంత్​ పరామర్శించారు. ఈ దాడులపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్, మానవహక్కుల సంఘానికి ఫిర్యాదుచేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రజలు ప్రశ్నిస్తే ఉక్కుపాదంతో అణచివేస్తున్నారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును ప్రజలు, ఉద్యమకారులు ద్వేషిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్​ ఎల్బీనగర్‌లో శ్రీకాంతాచారి విగ్రహానికి రేవంత్‌రెడ్డి నివాళులు అర్పించారు.

నిరుద్యోగ యువత, విద్యార్థి సమస్యలపై జంగ్‌ సైరన్​కు అడ్డంకులు సృష్టించడంపై రేవంత్​రెడ్డి మండిపడ్డారు. శ్రీకాంతాచారి మెడలో కనీసం దండ వేయనీయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాంతాచారి స్ఫూర్తితో కాంగ్రెస్ ఉద్యమిస్తోందన్న రేవంత్‌.. మహబూబ్‌నగర్‌లో నిరుద్యోగ జంగ్ సైరన్ నిర్వహిస్తామని వెల్లడించారు.

రాష్ట్రంలో తండ్రి, కుమారుడు భోగాలు అనుభవిస్తున్నారని కేసీఆర్​, కేటీఆర్​ను ఉద్దేశించే రేవంత్​ విమర్శలు చేశారు. ప్రతి నిరుద్యోగ యువకుడికి కేసీఆర్ బకాయి ఉన్నారని రేవంత్ చెప్పారు. భాజపా, తెరాస పార్టీలు ఒక్కటేనన్న పీసీసీ అధ్యక్షుడు.. రాష్ట్రంలో తెరాసకు, కేంద్రంలో భాజపాకు కాంగ్రెస్సే ప్రత్యామ్నాయమని స్పష్టం చేశారు.

REVANTH REDDY:'శ్రీకాంతాచారి స్ఫూర్తితో కాంగ్రెస్ ఉద్యమిస్తుంది'

జంగ్​ సైరన్​ సందర్భంగా ఏం జరిగిందంటే..

గాంధీజయంతి రోజున మొదలుపెట్టి డిసెంబరు 9న తెలంగాణ రాష్ట్రం సాకారమైన రోజు, సోనియాగాంధీ పుట్టిన రోజు(Sonia Gandhi Birth Day)న ముగించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే విద్యార్థి సమస్యలపై జంగ్‌ సైరన్‌ (Congress Jung Siren)) పేరుతో చేపట్టిన కార్యక్రమం రసాబాసగా మారింది.

దిల్‌సుఖ్‌నగర్‌ రాజీవ్‌ చౌక్‌ నుంచి ఎల్బీనగర్‌ సర్కిల్‌ వరకు పాదయాత్ర నిర్వహించి అక్కడ తెలంగాణ కోసం అమరుడైన శ్రీకాంతాచారికి నివాళులు అర్పించి అక్కడే సభలాంటిది నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం అనుమతి కోరగా పోలీసులు నిరాకరించారు. అనుమతి లేకపోయినా చేసి తీరతామని పీసీసీ ప్రకటించగా... పోలీసులు అప్రమత్తమయ్యారు. రాచకొండ, హైదరాబాద్‌ పోలీసులు రంగంలోకి దిగారు. దిల్‌సుఖ్​నగర్‌, ఎల్బీనగర్‌ సర్కిల్ వద్ద వందలాది మంది పోలీసులు మోహరించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో విద్యార్థి, నిరుద్యోగ యువత తరలివచ్చే అవకాశం ఉందని భావించిన పోలీసులు ఎక్కడిక్కడ కట్టడి చేసే కార్యక్రమాల్లో భాగంగా ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధం చేశారు.

కార్యక్రమం నిర్వహించి తీరాలన్న ఆలోచనతో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడానికి నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దిల్‌సుఖ్​నగర్‌ వద్దకు వచ్చిన వారిని వచ్చినట్లు హైదరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్లకు చెందిన పోలీసులు అరెస్టులు చేశారు. ఎల్బీనగర్‌ వద్ద విడతల వారీగా వచ్చిన వారిని వచ్చినట్లు పోలీసులు అరెస్టు చేస్తూ వచ్చారు. ఇంతలో ఒక్కసారిగా 2వేల మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు... తెలంగాణ కోసం అమరులైన శ్రీకాంతాచారి విగ్రహం వద్దకు దూసుకురావడం వల్ల అక్కడున్న పోలీసులు ఏం చేయలేకపోయారు. పోలీసులు తేరుకునే లోపు శ్రీకాంతాచారి విగ్రహం వద్దకు చేరుకుని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ముఖ్యులు అరెస్ట్...

పోలీసుల సంఖ్య తక్కువ కావడం, కార్యకర్తలు, నాయకులు ఎక్కువ మంది ఉండడం వల్ల కట్టడి చేసేందుకు పోలీసులు తమ లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. లాఠీఛార్జీ చేయడం వల్ల పలువురికి గాయాలయ్యాయి. కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులతోపాటు విలేకరులు, పోలీసులు కూడా గాయాలపాలయ్యారు. ఒకరిద్దరికి కాంగ్రెస్‌ కార్యకర్తలకు చేతులు విరగ్గా... పలువురు స్పృహ తప్పి పడిపోయి ఆస్పత్రిపాలయ్యారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీ గౌడ్‌, పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లురవి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తదితరుర ముఖ్యలు అరెస్టు అయ్యారు.

రేవంత్​ నిరసన...

గాంధీభవన్‌ నుంచి ప్రగతిభవన్‌ వద్ద ముట్టడికి వెళ్లేందుకు యత్నించిన మహిళ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు, పీసీసీ ఎస్సీ సెల్‌ ఛైర్మన్‌ ప్రీతమ్‌లను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి అబిడ్స్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌లతోపాటు పలువురిని ముందస్తు అరెస్టు చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి జంగ్‌ సైరన్‌ కార్యక్రమానికి హాజరు కాకుండా ముదస్తుగా జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్దనే పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ రేవంత్‌ రెడ్డి అక్కడే బైఠాయించారు.

ఒక ఎంపీగా తాను తన నియోజకవర్గంలో పర్యటించే అధికారం లేదా అని నిలదీశారు. తనను అడ్డుకోవడం అంటే తన హక్కులకు భంగం కలిగించడమేనని స్పష్టం చేసిన రేవంత్‌ రెడ్డి... ఎలా అడ్డుకుంటారని పోలీసులను ప్రశ్నించారు. గాంధీ జయంతి కావడం వల్ల తాము శాంతియుతంగానే నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. ఇలా అడ్డుకుంటే బాగుండదని పోలీసులతోపాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఇదీచూడండి:Congress Jung Siren: ఉద్రిక్తంగా కాంగ్రెస్ జంగ్ సైరన్... నేడు నిరసనలకు పీసీసీ పిలుపు

Last Updated : Oct 3, 2021, 2:45 PM IST

ABOUT THE AUTHOR

...view details