PAWAN KALYAN: వైకాపా మరోసారి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌ని ఎవరూ బాగు చేయలేరని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. విధానపరమైన లోపాల గురించి ప్రశ్నిస్తే అసభ్యంగా తిడుతున్నారని, ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి వైకాపా అరాచక పాలనను అంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మూడో విడత జనసేన జనవాణి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ ప్రజల సమస్యలపై పవన్ కల్యాణ్ అర్జీలు స్వీకరించారు. గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు, కృష్ణా తదితర జిల్లాల నుంచీ పలువురు వినతులిచ్చేందుకు తరలివచ్చారు. వీరితోపాటు అభిమానులు భారీగా హాజరయ్యారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 30 మంది జనసేన బృందం ప్రజల నుంచి దరఖాస్తుల నమోదు ప్రక్రియ నిర్వహించింది. మొత్తం 497 అర్జీలు వచ్చాయి. ‘వారం రోజులలోగా సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తాం’ అని పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. అర్జీల స్వీకరణ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్‌తో కలిసి మాట్లాడారు.
ప్రజల జీవితాలతో చెలగాటం..‘జనవాణిలో స్వీకరించిన అర్జీల్లో ప్రధానంగా ఏపీలో కుంటుపడిన మౌలిక సదుపాయాలు, మద్యం విక్రయాలు, ఇళ్ల పట్టాల్లో అవినీతి, టిడ్కో గృహాల్లో మోసాలు, పారిశుద్ధ్య సమస్యలు, దళితులపై దాడులు, పథకాల్లో కోతలు, ఇసుక దోపిడీ తదితర సమస్యలపై వచ్చినవే ఉన్నాయి. సంపూర్ణ మద్యనిషేధం హామీ ఇచ్చి ఆడపడుచుల ఓట్లతో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి రాష్ట్రంలో మద్యపానాన్ని విచ్చలవిడిగా ప్రోత్సహిస్తూ వారి పసుపు కుంకుమలను చెరిపేస్తున్నారు. వైకాపా పాలనలో దాదాపు 5వేల మంది కల్తీ మద్యం తాగి మరణించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వైకాపా చేస్తున్న గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆడపడుచులు ప్రశ్నించాలి. లోకల్ బ్రాండ్ల పేరుతో ప్రజారోగ్యంతో ఆడుకుంటున్నారు. బినామీల పేరిట కొత్త మద్యం పాలసీ ద్వారా ఏటా రూ.30వేల కోట్లు సంపాదించాలని ప్రయత్నిస్తున్నారు. కేంద్రం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తుంటే మద్యం విక్రయాల్లో నగదు తీసుకుంటూ దోచుకుంటున్నారు. ఏపీలో రహదారులపై ప్రయాణిస్తే గర్భిణులు మార్గమధ్యలోనే ప్రసవిస్తారు. రోడ్లన్నీ ఈతకొలనులను తలపిస్తున్నాయి. వైకాపా ప్రభుత్వాన్ని మేల్కొలపాలన్న ఉద్దేశంతోనే ‘గుడ్ మార్నింగ్ సీఎం సర్’ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం.
సామాన్యుల ఉసురుపోసుకుంటున్నారు:రకరకాల ఇసుక విధానాలను తీసుకొచ్చి అధికార పార్టీ ఇసుకాసురులతో దందా చేస్తున్నారు. లారీ ఇసుక రూ.28వేల- రూ.36వేల వరకూ అమ్ముతూ సామాన్యులతోపాటు భవన నిర్మాణ కార్మికుల ఉసురు పోసుకుంటున్నారు. విద్యా వ్యవస్థను కొత్త విధానం పేరుతో అయోమయంలోకి నెట్టారు. ప్రపంచ బ్యాంకు దగ్గర అడ్డదిడ్డంగా అప్పులు చేసి, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్యకు ఎంతో వ్యత్యాసం ఉండేలా జీవోనే తీసుకువచ్చారు. పాలసీ గురించి ప్రశ్నిస్తుంటే వైకాపా నాయకులు అసభ్య పదజాలంతో తిడుతున్నారు. అన్న వస్తే అద్భుతాలు చేస్తాడన్నారు. పాలన పూర్తి కావొస్తున్నా ఆయన ఏం అద్భుతాలు చేశారో అర్థం కావటం లేదు. డిగ్రీ చదివి ఉద్యోగాలు రాని యువత సంఖ్యలో దేశంలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. ఏపీలో ఎంతో మంది ఊతం లేని దివ్యాంగులుంటే తూతూమంత్రంగా పింఛను ఇస్తున్నారు. 3వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే 700 మందికి పరిహారం ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు’ అని పవన్ ధ్వజమెత్తారు.