పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతూ.. ప్రణాళికాభివృద్ధే ధ్యేయంగా మరో దఫా పట్టణ ప్రగతి కార్యక్రమాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. మరో తొమ్మది రోజుల పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. తొలి రోజు పలు పట్టణాల్లో చేపట్టిన పనుల వివరాలను అధికారులు వెల్లడించారు.
మూడో విడత పట్టణ ప్రగతి (PATTANA PRAGATHI)లో భాగంగా మొదటి రోజైన గురువారం జీహెచ్ఎంసీ మినహా ఇతర నగర, పురపాలికల్లో 30వేలకు పైగా మొక్కలు నాటారు. మరో 77 వేలకు పైగా మొక్కలను ఇంటింటికీ పంపిణీ చేసినట్లు పురపాలకశాఖ సంచాలకులు సత్యనారాయణ తెలిపారు.
కార్పొరేషన్లు, మున్సిపాల్టీల పరిధిలో 2,314 కిలోమీటర్ల మేర.. రహదార్లకు ఇరువైపులా మొక్కలు నాటినట్లు చెప్పారు. 128 విద్యుత్ మీటర్లను మార్చడం సహా 1,732 మీటర్ల మేర వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేశారు. మొత్తం 27,849 మీటర్లలో వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయాల్సి ఉందని విద్యుత్ అధికారులు అంచనా వేశారు. 168 పార్కులను శుభ్రం చేశారు. 1,338 కిలోమీటర్ల పరిధిలో మురుగు కాలువలను శుభ్రం చేసినట్లు సత్యనారాయణ తెలిపారు.