రాష్ట్రంలో మొక్కజొన్న, ధాన్యం సేకరణలో ఉత్పన్నమయ్యే సమస్యలపై సత్వర పరిష్కారం కోసం ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఈ యాసంగి మార్కెటింగ్ సీజన్‌లో రైతుల సౌకర్యార్థం 5 ప్రభుత్వ శాఖలతో కలిసి ఏర్పాటు చేసిన ఈ కంట్రోల్ రూంలో కాల్ సెంటర్ను కూడా అందుబాటులో ఉంచింది. క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు వస్తే రైతులు తమకు సమాచారం అందించాలని ప్రకటించింది. ఫలితంగా రోజు 100 ఫోన్లు వస్తున్నాయని రాష్ట్ర రైతుబంధు సమన్వయ సమితి ఛైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు.
కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి..
రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదులు, ఇతర సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు పల్లా తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పంట వస్తున్నందున రైతులకు కోత యంత్రాల కొరత ఏర్పడిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు 1500 యంత్రాలను తెప్పించి అన్ని జిల్లాలకు పంపించామన్నారు. గతంలో కంటే పంట దిగుబడి పెరిగింది... 39 లక్షల ఎకరాల విస్తీర్ణంలో కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రానుందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రూ.32 వేల కోట్ల బ్యాంకు గ్యారంటీ ఇచ్చారని పల్లా వివరించారు.