తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీకి ఆక్సిజన్ సమస్య.. ఆందోళనలో అధికారులు

ఏపీకి ఆక్సిజన్ సమస్య పొంచి ఉంది. అవసరాలకు తగ్గట్లు సరఫరా కాకపోవడంతో భవిష్యత్‌ పరిస్థితులపై ఆందోళన వ్యక్తమవుతోంది. పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా... ఆక్సిజన్‌ నిల్వలు పెంచుకోకుంటే ఇబ్బందులు తప్పవని అధికారులు చెబుతున్నారు.

oxygen problem in ap, lack of oxygen in ap, ap news
ఏపీకి ఆక్సిజన్ సమస్య, ఏపీకి ఆక్సిజన్ కొరత, ఏపీ న్యూస్

By

Published : Apr 27, 2021, 7:34 AM IST

ఏపీకి ఆక్సిజన్ సమస్య

ఏపీకి ఆక్సిజన్‌ సమస్య పొంచి ఉంది. ఆ రాష్ట్ర అవసరాలకు తగ్గ స్థాయిలో సరఫరా కాకపోవడంతో.. భవిష్యత్తు పరిస్థితులపై ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం 480 టన్నుల ఆక్సిజన్‌ను రాష్ట్రానికి కేటాయించినా.. 340 టన్నులు పొందడమే గగనంగా మారింది. ఒడిశాలోని రూర్కెలా నుంచి రాష్ట్రానికి రావడానికి 3, 4 రోజుల సమయం పడుతోంది. దీనికి తగ్గట్లు ట్యాంకర్లు లేకపోవడం మరో సమస్య. పైగా.. ఒడిశా నుంచి కేంద్రం కేటాయించింది 20 టన్నులే. శ్రీపెరంబుదూరు, బళ్లారి, ఇతర చోట్ల నుంచి ఆక్సిజన్‌ పూర్తిస్థాయిలో రావట్లేదు. విశాఖ నుంచే తగినంత వస్తోంది. ప్రస్తుత తీవ్రత దృష్ట్యా రానున్న 2-3 వారాల్లో రోజుకు 500-550 టన్నుల వరకు ఆక్సిజన్‌ అవసరం అవుతుందని అధికారుల అంచనా. ఈలోపు ఆక్సిజన్‌ సరఫరాను పెంచుకోకుంటే ఇబ్బందుల్లో పడతామని ఓ అధికారి పేర్కొన్నారు. ఇటీవల విశాఖ నుంచి మహారాష్ట్రకు ఎక్కువ ఆక్సిజన్‌ వెళ్లడంతో దాని ప్రభావం రాష్ట్రంపై పడింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని అధికారులు తెలిపారు.

వినియోగం ఎందుకు పెరిగింది?

గతేడాది సెప్టెంబరులో ఆక్సిజన్‌ అధికంగా అవసరం అయిన 2రోజుల్లో 260 టన్నుల చొప్పున వాడారు. కానీ... ఇప్పుడు ఆ స్థాయిలో కేసులు లేకపోయినా 300 టన్నులకు పైగా వాడుతున్నారు. 30% వరకు వృథా అవుతోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఇటీవల వ్యాఖ్యానించారు. 390 టన్నుల ఆక్సిజన్‌ అవసరం కాగా... ప్రస్తుతం 360 టన్నులే వస్తోందన్నారు. కేంద్రం 341 టన్నుల ఆక్సిజన్‌ను కేటాయించిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ చెప్పారు. ఇప్పుడు ఆక్సిజన్‌ వాడకం పెరగడానికి కారణాలపై పరిశీలిస్తున్నామని తెలిపారు. పల్స్‌ ఆక్సీమీటరులో 96% ఉన్నవారు.. ఐసీయూల్లోనూ కొందరికి అవసరం లేకపోయినా ఆక్సిజన్‌ వాడుతున్న విషయాన్ని గుర్తించినట్లు తెలిపారు. ఆసుపత్రుల వారీగా ఆక్సిజన్‌ సరఫరా, వినియోగం లెక్కలు తీస్తున్నారు.

పీడనం తగ్గడం వల్లనే సమస్యలు

విజయనగరం ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సరఫరాలో పీడనం తగ్గి ఇబ్బంది వచ్చినట్లు సింఘాల్‌ తెలిపారు. అక్కడి మరణాలకు, ఆక్సిజన్‌ సరఫరాకు సంబంధం లేదన్నారు. సాంకేతిక సమస్య పరిష్కారానికి విజయవాడ నుంచి విజయనగరానికి సిబ్బందిని పంపడానికి ఎక్కువ సమయం పట్టిందని చెప్పారు. సమయం వృథాకాకుండా ఉండేందుకు జిల్లా కేంద్రంలో ఒక సాంకేతిక నిపుణుడిని అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్యశాఖ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది.

ఆక్సిజన్ అందక కలకలం

విజయనగరం మహారాజా కేంద్రాసుపత్రిలో సోమవారం తెల్లవారుజామున ఆక్సిజన్‌ కలకలం రేగింది. సాంకేతిక సమస్య కారణంగా సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఆ సమయానికి ఆసుపత్రిలో 25 మంది కరోనా బాధితులకు ప్రాణవాయువు అందిస్తున్నారు. వారికి ఊపిరి ఆడని విషయాన్ని వైద్యులు గుర్తించి.. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా ఆసుపత్రికి చేరుకుని 14 మందిని నగరంలోని మూడు ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. మరో 11 మందికి బల్క్‌ సిలిండర్లు తీసుకొచ్చి ఆక్సిజన్‌ అందించారు. సమస్యను సరిచేసిన తర్వాత.. మధ్యాహ్నం 14 మందిలో ఇద్దరిని తిరిగి కేంద్రాసుపత్రికి తీసుకొచ్చారు. ముందుజాగ్రత్తగా విశాఖ నుంచి ఒక కేఎల్‌ ఆక్సిజన్‌ ట్యాంకరును రప్పించి ప్లాంటులో నింపారు. బాధితుల బంధువులు మాత్రం ఆక్సిజన్‌ అందక తమ కుటుంబసభ్యులు మరణించారని ఆరోపిస్తున్నారు.

ఎవరూ చనిపోలేదు: కలెక్టర్‌

ఆక్సిజన్‌ తక్కువ పీడనంతో సరఫరా కావడంతో వెంటనే అప్రమత్తమై బల్క్‌ సిలిండర్లు ఏర్పాటు చేశామని కలెక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ తెలిపారు. ఆసుపత్రిలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఘటన సమయంలో ఆసుపత్రిలో 290 మంది చికిత్స పొందుతుండగా, 25 మంది ఆక్సిజన్‌పై ఉన్నారన్నారు. ఇద్దరు కొవిడ్‌ సమస్యతో చనిపోయినట్లు వైద్యులు చెప్పారని, ఆక్సిజన్‌ అందక ఎవరూ మృతి చెందలేదని ప్రకటించారు. ఆసుపత్రిలో సామర్థ్యానికి మించి వైద్యసేవలు అందిస్తున్నామని సూపరింటెండెంట్‌ తరఫున ఆర్‌ఎంవో గౌరీశంకర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్ధరాత్రి 2.30 సమయంలో ఆక్సిజన్‌ తగ్గుతోందని ఫోన్‌ రాగానే వెంటనే ట్యాంకర్‌ను తనిఖీ చేశామన్నారు. లో ప్రెజర్‌ వల్లే సాంకేతిక సమస్య వచ్చిందన్నారు.

ఘటనపై జిల్లాజడ్జి సమీక్ష

ఈ ఘటనపై జిల్లాజడ్జి జి.గోపి స్పందించారు. ఆసుపత్రి వైద్యాధికారులను, కలెక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ను వివరాలు అడిగారు. రోగులకు అసౌకర్యం లేకుండా చూడాలని, వైద్యం అందించడంలో సాంకేతిక అవాంతరాలు లేకుండా చూడాలని సూచించారు.

సాంకేతిక సమస్యను పరిష్కరిస్తున్నాం: ఉప ముఖ్యమంత్రి

ఆక్సిజన్‌ సరఫరాలో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరిస్తున్నామని ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని దృష్టికి తీసుకెళ్లగా.. బాధితులను తక్షణమే వేరే ఆసుపత్రికి పంపించాలని, పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంటే విశాఖకు తరలించాలని ఆయన ఆదేశించినట్లు తెలిపారు.

ఆక్సిజన్‌ అందకే మా అమ్మ చనిపోయింది

మా అమ్మను ఈ నెల 21న ఆసుపత్రిలో చేర్పించాం. సోమవారం తెల్లవారుజామున 2 గంటల తర్వాత సరఫరా ఆగిపోయింది. వైద్యులు కూడా ఏమీ చేయలేకపోయారు. మా అమ్మను ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ప్రయత్నించా. ఎక్కడా పడకలు ఖాళీ లేవన్నారు. చివరకు ఆసుపత్రి సిబ్బంది ఉదయం 9 గంటలకు సిలిండరు తీసుకొచ్చారు. అది పెడుతుండగానే ఆమె చనిపోయారు.

- కె.వెంకటేష్‌, నెల్లిమర్ల మండలం

ABOUT THE AUTHOR

...view details