తెలంగాణ

telangana

By

Published : Mar 24, 2020, 7:30 AM IST

ETV Bharat / city

జలుబు, దగ్గుకు ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రత్యేక ఓపీ

కరోనా కట్టడికి.. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రుల సేవలనూ వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ముందే ఎంపిక చేసుకున్న శస్త్రచికిత్సలను నిలిపివేయగా.. ఈ విధానాన్ని తక్షణమే ప్రైవేటు ఆసుపత్రులకూ వర్తింపజేస్తూ సోమవారం ఆదేశాలు జారీచేసింది.

out patient special services start in private hospitals
జలుబు, దగ్గుకు ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రత్యేక ఓపీ

ప్రజారోగ్య అత్యవసర పరిరక్షణ చర్యల్లో భాగంగా.. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులూ వెంటనే కరోనా అనుమానితులు, బాధితులకు వైద్యసేవలందించేందుకు సిద్ధంకావాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రైవేటు ఆసుపత్రులు అనుసరించాల్సిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ సంచాలకులు జి.శ్రీనివాసరావు విడుదల చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలకు ఈ మేరకు లిఖితపూర్వక ఉత్తర్వులు పంపించారు. ప్రభుత్వ ఆదేశాలన్నింటినీ కచ్చితంగా పాటించాల్సిందేనని ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు.

ప్రైవేటుకు మార్గదర్శకాలివీ..

  1. సాధారణ ఓపీ సేవలకు వచ్చే రోగులతో శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లతో వచ్చేవారిని కలవకుండా చర్యలు తీసుకోవాలి
  2. శ్వాస సమస్యల రోగులకు ప్రత్యేక ఓపీ కౌంటర్లను ఏర్పాటు చేయాలి
  3. తీవ్ర శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లతో బాధపడుతున్న రోగులను వెంటనే ఆసుపత్రిలో చేర్చుకొని, వారిని విడి గదిలో ఉంచి చికిత్స అందించాలి
  4. నిర్దేశించిన నిబంధనల ప్రకారం.. అనుమానితుని నమూనాను సేకరించి పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రి ప్రయోగశాలకు పంపించాలి
  5. ఒకవేళ బాధితునిలో కరోనా వైరస్‌ ఉన్నట్లుగా నిర్ధారణ జరిగితే.. ఆ రోగిని ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పంపించొద్దు. అదే ఆసుపత్రిలో విడి గదిలోనే ఉంచి వైద్య మార్గదర్శకాల మేరకు చికిత్స అందించాలి
  6. అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ కరోనా అనుమానితులు, బాధితుల చికిత్స కోసం ప్రత్యేక వార్డులు, గదులు యుద్ధప్రాతిపదికన నెలకొల్పాలి

ABOUT THE AUTHOR

...view details