Ukraine Crisis: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని ఉంటే మూడో ప్రపంచ యుద్ధానికి అంకురార్పణ జరిగే ప్రమాదం ఉండేదని పూర్వపు యూఎస్‌ఎస్‌ఆర్, ప్రస్తుత రష్యా, ఉక్రెయిన్ స్థితిగతులపై అపార అవగాహన ఉన్న, ఆయా దేశాల్లో సుదీర్ఘకాలం పనిచేసిన మాజీ దౌత్యవేత్త డాక్టర్ టి.సురేష్‌బాబు అభిప్రాయపడ్డారు. నాటోలో సభ్యత్వం ఇవ్వకపోయినా ఉక్రెయిన్‌కి 600 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధ సామగ్రిని, మిలటరీ సాంకేతిక నైపుణ్యాన్ని, సైనిక సిబ్బందికి విస్తృతస్థాయిలో శిక్షణను అందించిందని సురేష్‌బాబు తెలిపారు. నాటో ప్రధాన కార్యాలయం ఉన్న బ్రసెల్స్‌లోని సైనిక కమాండ్‌తో ఉక్రెయిన్ మిలటరీ కమాండ్‌ని అనుసంధానించిందని చెప్పారు. ప్రత్యక్షంగా యుద్ధంలో దిగబోమని ముందునుంచే అమెరికా. నాటో ప్రకటించాయని గుర్తుచేశారు. పటిష్ఠమైన సైనిక బలగం, అపార అణ్వాయుధ సంపత్తి కలిగిన రష్యాతో యుద్ధానికి దిగితే తీవ్ర పరిణామాలకు దారితీసేదని, అందుకే కఠిన ఆర్థిక ఆంక్షలు విధించడానికే అమెరికా సహా నాటో దేశాలు పరిమితమయ్యాయని విశ్లేషించారు. రష్యా చమురు, సహజవాయువుపై ఆధారపడిన ఐరోపా దేశాలకు ఈ ఆంక్షలు ఎంత ఇబ్బందికరమో, రష్యాకీ అంతే ఇబ్బందికరం అవుతాయని... వీటన్నింటికీ సిద్ధపడే రష్యా యుద్ధానికి దిగిందని వివరించారు. మూడువైపుల నుంచి చుట్టుముట్టడం.. కీలక స్థావరాలను రెండో రోజే చేజిక్కించుకోవటం.. ఇలా రోజుల్లోనే యుద్ధం ముగిసేలా కొన్ని నెలల నుంచే రష్యా సన్నద్ధమైనట్లు యుద్ధం తీరు తెలియజేస్తోందని విశ్లేషించారు.
దౌత్యరంగంలో అపార అనుభవం..
విజయవాడ నగర మొదటి మేయర్ వెంకటేశ్వరరావు కుమారుడైన సురేష్‌బాబు రష్యాలో ఉన్నతవిద్య అభ్యసించారు. చరిత్రలో ఎంఏ, పీహెచ్‌డీ చేశారు. దిల్లీలోని జేఎన్‌యూలో గల సోవియట్ స్టడీస్ సెంటర్‌లో రిసెర్చ్ కన్సల్టెంటుగా ఉన్నారు. యూపీఎస్‌సీ ద్వారా విదేశాంగశాఖలో అధికారిగా చేరి వివిధ హోదాల్లో యూఎస్‌ఎస్‌ఆర్‌లో, ఆ తర్వాత కామన్‌వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్(సీఐఎస్) పరిధిలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఉక్రెయిన్‌లోని ఒడెస్సాలో ఉన్న భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో కాన్సుల్‌గా, మాస్కోలోని ఎంబసీలో కాన్సులర్‌గా, ఆర్మేనియా, జార్జియా, మంగోలియాలకు అంబాసిడర్‌గా పనిచేశారు. పీవీ నరసింహారావు, వాజపేయి, మన్‌మోహన్‌సింగ్, నరేంద్రమోదీ లాంటి నాయకులు రష్యా, సీఐఎస్ దేశాల్లో పర్యటించినప్పుడు ఆయా దేశాల అధ్యక్షులతో జరిగిన సమావేశాల్లో అనువాదకునిగా వ్యవహరించారు.
కొత్తరూపంలో యూఎస్‌ఎస్‌ఆర్‌ని తీసుకురావాలన్న కోరిక..
పాత సోవియట్ రిపబ్లిక్‌లు నాటోలో చేరకుండా నియంత్రించడమే కాకుండా కొత్త రూపంలో బలమైన యూఎస్‌ఎస్‌ఆర్ తరహా వేదికను ఏర్పాటుచేయాలన్న కోరిక కూడా ఉక్రెయిన్‌తో యుద్ధానికి తలపడేలా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను పురికొల్పి ఉంటుంది. ఉక్రెయిన్ భౌగోళికంగా పెద్ద దేశం. యూఎస్‌ఎస్‌ఆర్‌లో మూడో అతిపెద్దది. రష్యాతో సుదీర్ఘమైన సరిహద్దు ఉంది. యూఎస్‌ఎస్‌ఆర్‌తో కలిసున్నప్పుడు అందరికీ కావాల్సినన్ని గోధుమల్ని ఉత్పత్తిచేసేంత సారవంతమైన భూమి ఉంది. ఉక్రెయిన్‌ను సోవియట్‌కు అన్నదాతగా చెప్పేవారు. ఇది నాటోలో చేరితే అక్కడి నుంచి ప్రయోగించే క్షిపణులు 5-7 నిమిషాల్లోనే మాస్కోకు చేరగలవు. వీటన్నింటి దృష్ట్యా ఉక్రెయిన్ నాటోలో చేరకుండా చూడటం రష్యాకు కీలకం. యూఎస్‌ఎస్‌ఆర్ విచ్ఛినమైన తర్వాత తొలుత తూర్పు ఐరోపా దేశాలు, తర్వాత ఒకప్పటి సోవియట్ రిపబ్లిక్‌లైన బాల్టిక్ దేశాలు నాటోలో భాగస్వాములయ్యాయి. మొదట్లో బలహీనంగా ఉన్న రష్యా దీనికి అభ్యంతరం తెలిపినా ఫలితం లేకపోయింది. ఒకదశలో తామూ నాటోలో భాగస్వాములవుతామని ప్రతిపాదించింది. నాటోతో పరస్పర సహకారానికి నాటో-రష్యా కౌన్సిల్ ఏర్పాటుచేసుకుంది. క్రిమియాను రష్యా ఆక్రమించిన తర్వాత ఆ కౌన్సిల్ రద్దయింది. బాల్టిక్ దేశాలు ఎస్తోనియా, లాత్వియా, లిథువేనియాలు చాలా చిన్నవి, పెద్దగా ప్రాధాన్యం లేనివి. ఇవి నాటోలో చేరినప్పుడూ రష్యా వ్యతిరేకించింది. నాటో నుంచి బాల్టిక్ దేశాల మీదుగా ఏదైనా ముప్పు తలెత్తినా, ఎదుర్కొనేందుకు అవసరమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌తో కూడిన ఏర్పాట్లను బెలారస్‌లో రష్యా సిద్ధం చేసుకుంది. 2008లో జార్జియా నాటోలో భాగస్వామిగా మారే ప్రయత్నాలు చేసినప్పుడు గట్టిగా అడ్డుపడింది. ఆ దేశంలో రష్యన్లు అధికంగా ఉండే రెండు ప్రాంతాల్ని స్వతంత్ర దేశాలుగా గుర్తించింది. ఇక్కడి ప్రజలకు రష్యా పాస్‌పోర్టులు అందించింది. ఒకదశలో జార్జియాపై ఒత్తిడి తెచ్చేందుకు ఆ దేశ రాజధాని వరకు రష్యా సైన్యం వెళ్లింది. ఫ్రాన్స్ అధ్యక్షుడి దౌత్యంతో ఉద్రిక్తతలు సడలిపోయాయి. తర్వాత నాటోలో జార్జియా చేరే ప్రక్రియ ఆగిపోయింది. ఇప్పటికీ రష్యా, జార్జియాల మధ్య దౌత్య సంబంధాల్లేవు.
ఉక్రెయిన్.. వ్యూహాత్మకం..