Agnipath Agitation: 'అగ్నిపథ్' ఆందోళనల కారణంగా శుక్రవారం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో తీవ్ర విధ్వంసం చోటుచేసుకున్న నేపథ్యంలో.. రైల్వే శాఖ మరింత అప్రమత్తమైంది. 'అగ్నిపథ్' సెగ ఆంధ్రప్రదేశ్‌కి తగలకుండా ఉండేందుకు రైల్వే అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే విశాఖ రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న ఓ యువకుడిని పోలీసులు గుర్తించారు. స్టేషన్‌కు ఏ మార్గం ద్వారా చేరుకోవాలో.. వాట్సాప్‌లో పెద్ద ఎత్తున పోస్టు చేస్తున్నట్లు గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు.
భద్రతా కారణాల దృష్ట్యా విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. స్టేషన్‌లోకి ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేశారు. మరోవైపు విజయవాడ నుంచి వచ్చే రైళ్లన్నీ దువ్వాడ వద్ద, హవ్‌డా నుంచి వచ్చే వాటిని కొత్తవలస వద్ద నిలిపివేసి.. దారి మళ్లించనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
విశాఖ రైల్వే స్టేషన్‌కు రైళ్లు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. రైల్వే స్టేషన్‌కు అర కిలోమీటర్ మేర ముందే బారికేడ్లు ఏర్పాటు చేశారు. విశాఖ భద్రతా వ్యవహారాలను సీపీ శ్రీకాంత్ స్వయంగా పరిశీలిస్తున్నారు. మద్దిలపాలెం, హనుమంతవాక దగ్గర పోలీస్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.