తెలంగాణ

telangana

ETV Bharat / city

ఇకపై రెండు ప్రశ్నపత్రాలు... ఏది కావాలో విద్యార్థి ఇష్టం - జాతీయ నూతన విద్యా విధానం వార్తలు

ఇప్పటివరకు చదువులో బాగా వెనకబడి ఉన్న విద్యార్థికి, అత్యంత ప్రతిభావంతుడైన విద్యార్థికీ పరీక్షలో ఒక్కటే ప్రశ్నపత్రం ఉండేది. ఈ విధానం వచ్చే రెండేళ్లలో మారనుంది. పాఠశాల విద్యలోని 9-10 తరగతుల పరీక్షల్లో ప్రతి సబ్జెక్టుకు రెండురకాల ప్రశ్నపత్రాల విధానం రానుంది. ఒకదానిలో సులభమైనవి, మరోదానిలో ప్రామాణికమైన ప్రశ్నలుంటాయి. తమ ప్రతిభను, ఆసక్తిని బట్టి విద్యార్థులు ఒకదాన్ని ఎంచుకోవచ్చు. జాతీయ నూతన విద్యా విధానంలో తీసుకొస్తున్న కొత్త మార్పు ఇదీ.

education
education

By

Published : Aug 3, 2020, 7:02 AM IST

జాతీయ నూతన విద్యా విధానం ద్వారా పరీక్షల విధానంలో కొత్త మార్పులు తీసుకువచ్చింది కేంద్రం. పాఠశాల విద్యలోని 9-10 తరగతుల పరీక్షల్లో ప్రతి సబ్జెక్టుకు రెండురకాల ప్రశ్నపత్రాల విధానం రానుంది. ఒకదానిలో సులభమైనవి, మరోదానిలో ప్రామాణికమైన ప్రశ్నలుంటాయి. తమ ప్రతిభను, ఆసక్తిని బట్టి విద్యార్థులు ఒకదాన్ని ఎంచుకోవచ్చు. ఇప్పటికే సీబీఎస్‌ఈ 2019-20 విద్యాసంవత్సరం నుంచి పదో తరగతి గణితం సబ్జెక్టుకు ఈ విధానాన్ని అమలుచేసింది.

ఆసక్తి ఉన్న సబ్జెక్టు

దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని మొదట గణితం సబ్జెక్టుతో అన్నిబోర్డుల్లో అమలుచేస్తారు. 2022-23 విద్యాసంవత్సరం నుంచి ఈ కొత్త విధానం అమలయ్యే అవకాశముంది. క్రమేణా అన్ని సబ్జెక్టులకు విస్తరిస్తారు. ఆసక్తి లేని సబ్జెక్టులుంటే విద్యార్థులు సులభమైన ప్రశ్నపత్రాన్ని ఎంచుకోవచ్చు. అయితే పాఠ్యాంశాల బోధన మాత్రం అందరికీ ఒకేరకంగా ఉంటుంది.

రెండు భాగాలుగా ప్రశ్నపత్రాలు

ఇప్పటివరకు పది, ఇంటర్‌ పరీక్షల్లో అధిక శాతం వ్యాసరూప ప్రశ్నలే ఉంటున్నాయి. దాన్ని మార్చి ప్రశ్నపత్రాన్ని రెండు భాగాలుగా విభజిస్తారు. వ్యాసరూప ప్రశ్నలతోపాటు బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు(ఎంసీక్యూ) ఉంటాయి. వీటన్నిటిపై ఆయా రాష్ట్రాల ఎస్‌సీఈఆర్‌టీలతో సంప్రదించి జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్‌టీ) అవసరమైన మార్గదర్శకాలు రూపొందిస్తుంది.

ప్రైవేట్‌ పాఠశాలలూ పాటించాల్సిందే

ఇప్పటివరకు 1-9వ తరగతి వరకు పరీక్షల ప్రశ్నపత్రాలను జిల్లా ఉమ్మడి పరీక్ష మండళ్లు (డీసీఈబీ) తయారుచేసి పాఠశాలలకు పంపించేవి. అయితే ప్రైవేట్‌ పాఠశాలలు ఫీజులు చెల్లించి ప్రశ్నపత్రాలను తీసుకుంటాయి తప్ప చాలాచోట్ల వాటిని వినియోగించవు. సొంతగా రూపొందించుకొని వాటి ద్వారా పరీక్షలు నిర్వహించుకునేవి. కొత్త విద్యా విధానంలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరీక్షించేందుకు 3, 5, 8 తరగతులకు ఆయా సాధికార సంస్థలతో పరీక్షలు జరపాలని పేర్కొన్నారు.

ఈ క్రమంలో విద్యాశాఖ తయారుచేసే ప్రశ్నపత్రాలను ప్రైవేట్‌ పాఠశాలలు తప్పకుండా వినియోగించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పరీక్షల ఫలితాలు, ఆయా పాఠశాలల్లో పిల్లల అభ్యసన సామర్థ్యాలు ఎలా ఉన్నాయో వెబ్‌సైట్లో ఉంచుతారు. పాఠశాలలకు అక్రిడిటేషన్‌ ఇచ్చే సమయంలో వాటినీ ఒక కొలమానంగా పరిగణిస్తారు.

ABOUT THE AUTHOR

...view details