NTR Trust: కొవిడ్ బాధితులకు తమవంతు సాయం అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్టు ముందుకొచ్చింది. మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఆదేశాలతో ఉచిత వైద్య సేవలు పునఃప్రారంభం కానున్నాయి. కొవిడ్ బాధితులకు టెలిమెడిసిన్ కోసం ప్రత్యేక వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆన్లైన్ ద్వారా నేరుగా వైద్యులతో కొవిడ్ బాధితులు మాట్లాడేలా ఏర్పాటు చేస్తున్నారు. ఎన్ఆర్ఐ వైద్యులు లోకేశ్వరావుతో పాటు రాష్ట్రంలోని నిపుణులతో ఈ వైద్య బృందం ఏర్పాటైంది.
ప్రతి రోజు ఉదయం 7 గంటలకు జూమ్ కాల్ ద్వారా కొవిడ్ రోగులకు వైద్య సూచనలు ఇవ్వనున్నారు. రోగులకు అవసరమైన మందులు, మెడికల్ కిట్లను సైతం ఎన్టీఆర్ ట్రస్టు అందుబాటులోకి తెచ్చింది. గత ఏడాది కొవిడ్ సమయంలో రూ. కోటి 75 లక్షల ఖర్చుతో పలు సేవలు అందించినట్లు ఎన్టీఆర్ ట్రస్టు ఓ ప్రకటనలో పేర్కొంది.