పొలిటికల్ స్క్రీన్‌పై.. ఎన్టీవోడు బ్లాక్ బస్టర్..! NTR Political journey : తెలుగు రాజకీయాల్లో ఎన్టీఆర్ కొట్టిన హిట్ అలాంటిలాంటిది కాదు..! తెలుగు రాజకీయాల ప్రస్తావన వస్తే.. ఎన్టీఆర్ కి ముందు, ఎన్టీఆర్ తర్వాత అని చెప్పుకోవాల్సిందే. ఆయన రాజకీయ ప్రవేశం.. తెలుగునాట రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేసింది. అప్పటిదాకా ఉన్న రాజకీయ పద్ధతులు, విధానాలు, నాయకుల వ్యవహారశైలిని.. సమూలంగా ప్రక్షాళన చేసింది. రాజధానికే పరిమితమైన రాజకీయాన్ని ప్రజల మార్గం పట్టించి.. ఊరూవాడ చైతన్యం రగిలించి.. ప్రజా రాజకీయానికి నాందీ ప్రస్తావన చేసి.. పదవీ రాజకీయాలను పాతిపెట్టి.. జనరంజక పాలనకు శ్రీకారం చుట్టింది.
తెలుగుదేశం పిలుస్తోంది - కదిలిరా :1923 మే 28న కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించి, మనదేశం సినిమాతో చలనచిత్ర రంగంలో అడుగుపెట్టిన ఎన్టీఆర్ .. ప్రజాభిమానంతో వెండితెర వేల్పుగా ఎదిగారు. మూడున్నర దశాబ్దాలపాటు "రారాజు"లా తెలుగు తెరను ఏలిన ఎన్టీవోడు.. తనను ఇంతటి వాణ్ని చేసిన ప్రజలకు ఏదైనా చేయాలనే కాంక్షతో రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1982 మార్చి 29న హైదరాబాద్ న్యూఎమ్మెల్యే క్వార్టర్స్ వేదికగా పార్టీ ప్రకటన చేశారు. నేను తెలుగువాడిని.. నాది తెలుగుదేశం పార్టీ అని ఘనంగా ప్రకటించారు. "తెలుగుదేశం పిలుస్తోంది - రా కదిలిరా" అంటూ ఆరు కోట్ల ఆంధ్రులకు పిలుపునిచ్చారు.
9 నెలల్లోనే అఖండ విజయం :అలా పురుడు పోసుకున్న తెలుగుదేశం పార్టీ.. ఎన్టీఆర్ నాయకత్వంలో తెలుగు రాజకీయాలకు కొత్త నడకలు నేర్పింది. మూస ధోరణులకు స్వస్తి పలికి.. నవ్యపథంలో అడుగులు వేసింది. "మఖలో పుట్టి పుబ్బలో పోయే పార్టీ" అంటూ ఆనాటి ఏలికలు ఎగతాళి చేసినా.. వాటన్నింటినీ తోసిరాజని కొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ రాజకీయాల్లో మునుపెన్నడూ చూడని విధంగా.. భవిష్యత్తులో ఇంకెవరికీ సాధ్యంకాని రీతిలో.. పార్టీ ప్రారంభించిన 9 నెలల కాలంలోనే సంచలన విజయం సాధించింది. మూడున్నర దశాబ్దాల అప్రతిహత విజయాలతో తిరుగులేదనుకున్న కాంగ్రెస్ పార్టీకి.. తొలిసారిగా ఓటమి రుచి చూపించింది.
కంచుకోటలు బద్ధలు : తెలుగు రాజకీయ చైతన్య కరదీపికగా, వెనుకబడిన వర్గాలకు ఆలంబనగా, ప్రగతిశీల రాజకీయాలకు దర్పణంగా.. సంక్షేమం, అభివృద్ధి అజెండాతో ముందుకెళ్లిన ఎన్టీఆర్.. తెలుగువాడి ఆత్మగౌరవ నినాదాన్ని బలంగా వినిపించారు. అప్పటి ముఖ్యమంత్రి అంజయ్యను రాజీవ్‌గాంధీ అవమానించిన ఘటన.. తెలుగు ప్రజల్ని తీవ్రంగా గాయపర్చింది. ఈ అంశాన్ని అందిపుచ్చుకున్న ఎన్టీఆర్.. విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లారు. తెలుగువాడి ఆత్మగౌరవానికి, దిల్లీ అహంభావానికి పోరాటమంటూ నినదించారు. ఈ నినాదమే తెలుగునాట రాజకీయ సునామీ సృష్టించడంలో కీలకంగా నిలిచింది. కాంగ్రెస్ కంచుకోటల్ని బద్దలు కొట్టింది. దిల్లీ సుల్తానులను గడగడలాడించింది.
అనితర సాధ్యమైన ఘనత : పార్టీ పురుడు పోసుకున్న 9 నెలల్లో.. మూడొంతులకు పైగా స్థానాలతో అధికార పీఠాన్ని అధిష్టించడమంటే సాధారణ విషయం కాదు. మహామహా రాజకీయ పండితులనే ఆశ్చర్యపరిచిన ఈ రాజకీయ ప్రకంపన ఎలా సాధ్యమైంది..?.. తెలుగు నేలకు దూరంగా ఉన్న ప్రతిఒక్కరి మదినీ తొలచిన ప్రశ్న ఇదే. అయితే తెలుగు గడ్డపై ఏం జరుగుతుందో దగ్గరి నుంచి గమనించిన వారందరికీ.. తెలుగుదేశం విజయం అనూహ్యమేమీ కాదు. ఎందుకంటే.. తెలుగుదేశం చరిత్రాత్మక విజయానికి ఏకైక కారణం ఎన్టీఆరేనని అందరికీ తెలుసు. పార్టీ ప్రారంభం నుంచి కర్త, కర్మ, క్రియ అన్నీ తానే అన్నట్లుగా.. అనుక్షణం జనంలో ఉంటూ.. ప్రజానాడి పట్టిన రాజకీయ వైద్యుడు ఎన్టీఆర్ అని తెలుగునాట ఉన్న వారందరికీ చిర పరిచితమే.
ప్రజలే దేవుళ్లు - సమాజమే దేవాలయం : తెలుగుదేశం ప్రభంజనంలో ఎన్టీఆర్ అనుసరించిన ప్రచార సరళి కీలక పాత్ర వహించింది. పార్టీ ప్రకటించగానే "ఆశీర్వదించండి" అంటూ నేరుగా జనంలోకి వెళ్లారు. "సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్ళు" అంటూ చైతన్యరథంపై ఊరూవాడ తిరిగారు. జనంతో మమేకమయ్యారు. కష్టసుఖాలు ఆలకించారు. స్నానం, పానం అన్నీ రోడ్డు పక్కనే చేశారు. అలా 9 నెలల పాటు అవిశ్రాంతంగా రాష్ట్రాన్ని చుట్టేశారు. దాదాపు 35 వేల కిలోమీటర్ల చైతన్యయాత్ర ద్వారా.. తెలుగుదేశం జెండా, అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లారు. అప్పటిదాకా ఎమ్మెల్యే స్థాయి నాయకుడే ప్రజల చెంతకు రాని పరిస్థితుల్లో.. తెరవేల్పు ఎన్టీఆర్ గడపగడపకూ వచ్చి పలకరించడం ప్రజల మనసులు గెలిచింది.
ఎన్టీఆర్ ప్రజా రాజకీయం : జన రాజకీయాలతో తెలుగునాట కొత్త ఒరవడి సృష్టించిన ఎన్టీఆర్ .. అభ్యర్థుల ఎంపికలోనూ అదే పంథా అనుసరించారు. అప్పటిదాకా రాజకీయాల్లో వేళ్లూనుకున్న కుటుంబాలు, నాయకులను దగ్గరికి రానివ్వలేదు. కులం, మతం, ధనం ప్రమాణాలుగా కుళ్లిపోయిన రాజకీయ పద్ధతులకు సమాధి కట్టి.. జనంలో నుంచే అభ‌్యర్థులను ఎంచుకున్నారు. ఎలాంటి రాజకీయ నేపథ్యమూ లేని కుటుంబాల నుంచి వచ్చిన ఉన్నత విద్యావంతులు, ప్రజాసేవ చేయాలన్న తపన ఉన్న యువ నాయకత్వానికి అవకాశం కల్పించారు. అందులోనూ బడుగు, బలహీనవర్గాలకు పెద్దపీట వేశారు. మీలో ఒకరిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టా.. గెలిపిస్తే మీ సేవకుడిగా ఉంటారంటూ కొత్త రాజకీయం చేశారు. అప్పటిదాకా ధనికులు, భూస్వాములు, నెత్తిన కూర్చుని పెత్తనం చేసే నాయకుల తీరుతో విసిగిపోయిన జన సామాన్యానికి.. ఎన్టీఆర్ ప్రజారాజకీయం గుండెల్ని తాకింది. అదే తెలుగుదేశం ప్రభంజనానికి బాటలు వేసింది.
పతాక రూపశిల్పి : వీటన్నింటికీ తోడు.. పార్టీ జెండా-అజెండా తయారీ, ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో ఎన్టీఆర్ సరికొత్త పంథా అనుసరించారు. జెండా వేరు, అజెండా వేరు అనే పాత పద్ధతులకు స్వస్తి పలికారు. తానే స్వయంగా పార్టీ పతాకానికి రూపకల్పన చేశారు. తెల్ల కాగితంపై నాగలి, గుడిసె, చక్రం చిత్రాలు గీశారు. నాగలి కర్షకులకు, గుడిసె పేదలకు, చక్రం శ్రామికులకు సంకేతంగా నిర్వచించారు. శుభసూచకంగా భావించే పసుపు రంగును జెండా కోసం ఎంచుకున్నారు. నాగలికి ఆకుపచ్చ, గుడిసెకు తెలుపు, చక్రానికి ఎరుపు రంగు వేయించారు. ఆ విధంగా ఒకేసారి జెండాను, పార్టీ అజెండాను ఖరారు చేశారు. అలా పసుపు జెండా, దానిపైనే తీర్చిదిద్దిన పార్టీ అజెండా బలంగా జనంలోకి వెళ్లాయి. సామాన్యుడి వాహనం సైకిల్ పార్టీ ఎన్నికల గుర్తుగా ఎంచుకోవడమూ కలిసొచ్చింది. సంచలన విజయం సాధించడానికి కారణమైంది.
ఎన్టీఆర్ పిలుపే ప్రభంజనమై.. పలుకే పెను సంచలనమై.. ఆయన మాటే తూటాలా ప్రజల్లోకి చొచ్చుకెళ్లింది. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత అపజయమే ఎరుగని కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించింది. 200కు పైగా స్థానాల్లో తెలుగుదేశం కూటమి జయకేతనం ఎగురవేసి... నందమూరి తారకరామారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన 1983 జనవరి 9వ తేదీన.. తెలుగు ప్రజల కీర్తిపతాక సగర్వంగా ఎగిరింది.