Noise pollution in Hyderabad: బస్సులు, కార్ల హారన్లు... బుల్లెట్ల శబ్దాలు, విన్యాసాలు చేసుకుంటూ బైకులపై వెళ్తున్న యువకులు.. హైదరాబాద్ ట్రాఫిక్‌ల్ నిత్యం కనిపించే దృశ్యాలివి. ఇవి పగలు మాత్రమే కాదు, రాత్రి కనిపిస్తున్నాయి. రాత్రుళ్లు వాహనాల రాకపోకలు తగ్గినా హారన్లు, బైకులు, కార్ల శబ్దాలతో మోత మోగుతోంది. చాలా ప్రాంతాల్లో పరిమితికి మించి శబ్దం ఉత్పన్నమవుతోంది.
ఇదంతా నగరంలోని పలుచోట్ల కాలుష్య నియంత్రణమండలి ఏర్పాటు చేసిన ప్రత్యేక యంత్రాల్లో నమోదవుతోంది. ఈ ధ్వని కాలుష్యాన్ని తగ్గించేందుకు మరిన్ని ప్రాంతాల్లో ప్రత్యేక యంత్రాలతో శబ్ద పరిమితులను లెక్కించాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు యోచిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో గస్తీ పెంచాలని, శబ్దం చేసుకుంటూ వెళ్తున్న వాహనాలను గుర్తించి జరిమానా విధించాలంటూ పోలీసులను కోరనున్నారు.