గత మూడేళ్లలో అనేకమంది ఐపీఎస్‌లు పదోన్నతి పొందారు. వారిని స్థాయికి తగ్గ పోస్టుకు మార్చాలి. కానీ అలా జరగడంలేదు. 2019 ఏప్రిల్‌లో సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్, కరీంనగర్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి, హైదరాబాద్ పశ్చిమ, మధ్య, తూర్పు మండలాల డీసీపీలు ఎ.ఆర్.శ్రీనివాసరావు, విశ్వప్రసాద్, రమేశ్‌రెడ్డి, సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతిలు ఎస్పీల నుంచి డీఐజీలుగా పదోన్నతులు పొందారు. వారిని డీఐజీ స్థాయి పోస్టుకు బదిలీ చేయాలి. కానీ చంద్రశేఖర్‌రెడ్డికి సీఐడీలో డీఐజీగా పోస్టింగ్ ఇచ్చి సంగారెడ్డి ఇన్‌ఛార్జిగా కొనసాగిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉన్న నలుగురు డీసీపీలను జాయింట్ కమిషనర్లుగా మార్చి పాత స్థానాలకు ఇన్‌ఛార్జులుగా కొనసాగిస్తున్నారు.
- 2006 బ్యాచ్‌కి చెందిన సుధీర్‌బాబు, ప్రమోద్‌కుమార్, ప్రభాకర్‌రావు, అకున్ సబర్వాల్‌లు ఐజీలుగా పదోన్నతి పొందారు. సుధీర్‌బాబు రాచకొండ అదనపు కమిషనర్‌గా ఉండగా.. ఆయన పోస్టు స్థాయిని ఐజీకి మార్చి అక్కడే కొనసాగిస్తున్నారు. కరీంనగర్ డీఐజీగా ఉన్న ప్రమోద్‌కుమార్‌కు సీఐడీలో ఐజీగా బదిలీ చేసి కరీంనగర్ డీఐజీ ఇన్‌ఛార్జిగా ఇచ్చారు. అంతకు ముందే ఆయనకు వరంగల్ డీఐజీ ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. వరంగల్ కమిషనర్ రవీంద్ర పదవీ విరమణ పొందగానే ఆ బాధ్యతలు కూడా ప్రమోద్‌కుమార్‌కు అప్పగించారు. తాజాగా ఆదివారం జరిగిన బదిలీల్లో హైదరాబాద్ స్పెషల్ బ్రాంచి సంయుక్త కమిషనర్‌గా ఉన్న తరుణ్ జోషిని వరంగల్ కమిషనర్‌గా బదిలీ చేశారు.
- హైదరాబాద్ అదనపు సీపీ(నేరాలు)గా ఉన్న షీకాగోయల్ 2019 ఏప్రిల్‌లో అదనపు డీజీగా పదోన్నతి పొందారు. ఆమె అక్కడే కొనసాగుతున్నారు. అదనపు సీపీ (ట్రాఫిక్) అనిల్‌కుమార్ కూడా అదనపు డీజీగా పదోన్నతి పొందారు. హైదరాబాద్ కమిషనర్ అంజనీకుమార్ అదనపు డీజీనే కావడం గమనార్హం. ప్రస్తుతం హైదరాబాద్ కమిషనరేట్లో ముగ్గురు అదనపు డీజీలు పనిచేస్తున్నారు. రాచకొండ, సైబరాబాద్ కమిషనర్లు కూడా అదనపు డీజీలే. వాస్తవానికి ఇవి ఐజీ స్థాయి పోస్టులు. ఇక శివధర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, స్వాతిలక్రాలు కూడా అదనపు డీజీలుగా పదోన్నతులు పొందినప్పటికీ ఇంకా వారివారి స్థానాల్లోనే కొనసాగిస్తున్నారు.
- మాదాపూర్ డీసీపీగా పనిచేసిన వెంకటేశ్వరరావు డీఐజీగా పద్నోనతి పొందినప్పటికీ పోస్టింగ్ ఇవ్వకపోవడంతో ఎస్పీ స్థాయి పోస్టులోనే పనిచేస్తూ పదవీ విరమణ చేశారు. దాంతో కీలకమైన మాదాపూర్ ఇన్‌ఛార్జిగా అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లును నియమించారు. హైదరాబాద్‌లో కీలకమైన దక్షిణ మండలం డీసీపీగా గజారావ్ భూపాల్‌ను ఇన్‌ఛార్జిగా కొనసాగిస్తున్నారు.
- కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, భూపాలపల్లి జిల్లాలను కూడా ఇన్‌ఛార్జి ఎస్పీలతోనే నెట్టుకొస్తున్నారు. భైంసా వంటి సున్నిత ప్రాంతమున్న నిర్మల్ జిల్లాకు 9 నెలలుగా పూర్తి స్థాయి ఎస్పీ లేరు. ఆదిలాబాద్ ఎస్పీ విష్ణు వారియర్‌కు నిర్మల్ బాధ్యతలు అప్పగించారు. ఆదివారం జరిగిన బదిలీల్లో ఈయన్ను ఖమ్మం కమిషనర్‌గా బదిలీ చేశారు. దాంతో ఆదిలాబాద్, నిర్మల్‌లు ఇన్‌ఛార్జులతో నెట్టుకొని రావాల్సిన పరిస్థితి నెలకొంది.