schools problems: ఆంధ్రప్రదేశ్లోప్రభుత్వ పాఠశాలలకు నిర్వహణ నిధులు సక్రమంగా ఇవ్వడం లేదు. పురపాలక బడులకు గత మూడేళ్లుగా నిధులు మంజూరు కాలేదు. ప్రధానోపాధ్యాయులు సొంత డబ్బులు ఖర్చు చేసి బిల్లులు సమర్పించినా తిరిగి చెల్లించడం లేదు. కొన్ని పాఠశాలలకు 2020-21, 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన నిధులు రావాల్సి ఉంది. ఈ నిధులతోనే విద్యుత్తు బిల్లులు, రిజిస్టర్లు, చిన్న చిన్న మరమ్మతులు చేయిస్తారు. సీఎఫ్ఎమ్ఎస్లో బిల్లులు పెడితే నిధులు తగినంత లేవనే సమాధానం వస్తోందని పలువురు ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు. బిల్లులు ప్రధానోపాధ్యాయుడి లాగిన్‌లోనే ఉండిపోతున్నాయి. జీతాల నుంచి డబ్బులు ఖర్చు చేస్తే ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోతే ఎలా అని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
క్రీడా సామగ్రి, ప్రయోగశాలలు, దినపత్రికలు, అంతర్జాల సదుపాయం, తాగునీరు, బోధన సామగ్రి కొనుగోలుకు, చిన్న మరమ్మతులకు నిర్వహణ నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. నిధులే ఇవ్వకపోతే రిజిస్టర్లు, సుద్దముక్కలు లాంటి కనీస అవసరాలకూ ఇబ్బందులు తప్పడంలేదు. రెండేళ్ల క్రితం ఖర్చు చేసిన నిధులను ఇప్పటికీ చెల్లించకపోతే పాఠశాల నిర్వహణ ఎలా చేయాలని ప్రధానోపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలకు విద్యుత్తు బిల్లులు భారంగా మారుతున్నాయి. పాఠశాల నిర్వహణకు కేటాయిస్తున్న నిధులు వీటికే వెచ్చించాల్సి వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 44,639 పాఠశాలలు ఉండగా....వీటికి ఏడాదికి 60 కోట్లకుపైగా విద్యుత్తు బిల్లులు వస్తున్నాయి. ఈ బిల్లులకు ప్రత్యేక గ్రాంటు లేనందున ఉచిత విద్యుత్తు అందించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. విద్యుత్తు మీటర్లు కేటగిరి-2లో ఉండడంతో బిల్లులు అధికంగా వస్తున్నాయి. 30 మందిలోపు ఉండే బడులకు నిర్వహణ నిధులను కేవలం 10వేలు మాత్రమే ఇస్తున్నారు. దీంతో ఉపాధ్యాయులకు తిప్పలు తప్పడం లేదు.