తెలంగాణ

telangana

Dharani Portal Issues : ధరణిలో మాడ్యూళ్ల సంగతేంటి?

By

Published : Apr 11, 2022, 7:31 AM IST

Dharani Portal Issues : రాష్ట్రంలో భూ వివాదాలకు తావివ్వకుండా.. లెక్కలన్నీ పక్కాగా ఉండాలని ధరణి పోర్టల్‌ను ప్రారంభించిన ప్రభుత్వం.. ప్రారంభించిన నాటి నుంచి దాంట్లో ఎదురవుతున్న సమస్యలను పక్కనబెట్టింది. పోర్టల్ ప్రారంభించి చాలా రోజులు గడుస్తున్నా.. మాడ్యూళ్లు ఏర్పాటు కాలేదు. దాదాపు 5 లక్షల మంది రైతులు వివిధ సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ వానాకాలమైనా రైతు బంధు వస్తుందో లేదోనని ఎదురుచూస్తున్నారు.

Dharani Portal Issues
Dharani Portal Issues

Dharani Portal Issues : రాష్ట్రంలోని భూ యాజమాన్య హక్కుల సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్లో మాడ్యూళ్ల ఏర్పాటులో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. దాదాపు అయిదు లక్షల మంది రైతులు వివిధ సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆన్‌లైన్‌ ఫిర్యాదుల విభాగానికి పెద్ద ఎత్తున విజ్ఞాపనలు కూడా వచ్చాయి. ధరణి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం ప్రాథమిక నివేదిక ఇచ్చి అయిదు నెలలు గడుస్తున్నా ఒక్క మాడ్యూల్‌ కూడా విడుదల కాలేదు. మరో మూడు నెలల్లో వానాకాలం రైతుబంధు సాయాన్ని ప్రభుత్వం విడుదల చేయనున్న నేపథ్యంలోనైనా త్వరగా హక్కులు కల్పించాలని రైతులు కోరుతున్నారు. ఈ మేరకు ఆన్‌లైన్‌లో విజ్ఞప్తులు దాఖలవుతున్నాయి.

41 సమస్యలు గుర్తించినా..మెదక్‌ జిల్లా అచ్చంపేటకు చెందిన ఒక రైతు భూమి జూన్‌ 2020 తరువాత ఆన్‌లైన్‌ నుంచి మాయమైంది. నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళా రైతుకున్న మూడెకరాల్లో సగం మాత్రమే పాసుపుస్తకంలోకి ఎక్కింది. మిగతాది ఏమైందో తెలియదు. భద్రాద్రి జిల్లా గుండాలకు చెందిన వీరన్న ఇనాం భూమి ఇప్పటికీ ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. ఇలా ఒక్కటి కాదు లక్షల మందికి చెందిన హక్కుల సమస్యలున్నాయి. వాటిని పరిష్కరించాలంటూ రైతులు ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయాలకు వచ్చిపోతున్నారు. హైదరాబాద్‌లోని సీసీఎల్‌ఏ కార్యాలయానికి కూడా పెద్దఎత్తున వినతులు వస్తున్నాయి. మంత్రివర్గ ఉపసంఘం మొత్తం 41 రకాల సమస్యలు ఉన్నాయని గుర్తించి వాటి పరిష్కారానికి 8 మాడ్యూళ్ల ఏర్పాటు తప్పనిసరి అని సిఫార్సు చేసింది. ఇప్పటికీ మాడ్యూళ్లు ఏర్పాటుకాకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఏ సాయం అందడం లేదు :ఎకరానికి ప్రభుత్వం ఏటా రూ.10 వేల రైతుబంధు సాయం అందిస్తుండగా.. కేంద్రం రూ.6 వేల సాయం ఖాతాల్లో వేస్తోంది. వ్యవసాయ శాఖ వద్ద రైతుకు చెందిన ఖాతా, పాసుపుస్తకం వివరాలు ఉంటేనే ఈ లబ్ధి పొందవచ్చు. భూమి చేతిలో ఉన్నా, పాసుపుస్తకం లేకపోవడంతో ఏ సాయం కూడా అందడం లేదు. రైతు బీమాకు కూడా దూరంగా ఉండాల్సి వస్తోంది. చివరికి ప్రైవేటు వడ్డీకి భూమిని తాకట్టు పెట్టుకునే వెసులుబాటు కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారు. త్వరగా మాడ్యూళ్లు ఏర్పాటు చేసి హక్కులు కల్పించాలని వారు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details