కార్పొరేట్ ఆస్పత్రుల అడ్డగోలు దోపిడీకి అడ్డుకట్ట - క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ జీవో
New G.O. in Clinical Establishment :కొత్త ఆసుపత్రిని ప్రారంభించాలన్నా, అనుమతులను పునరుద్ధరించాలన్నా ఇప్పటి వరకూ జిల్లా వైద్యాధికారుల చేతుల్లోనే అధికారమంతా కొనసాగుతోంది. దీంతో ఆసుపత్రులు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నా చూసీచూడనట్లుగా వెళ్తున్నారనే విమర్శలున్నాయి. ఇందులో ప్రైవేటు ఆసుపత్రుల నుంచి జిల్లా వైద్యాధికారులకు నెలనెలా భారీగా ముడుపులు ముడుతున్నట్లుగా పెద్దఎత్తున ఆరోపణలూ వచ్చాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర సర్కార్ క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టాన్ని మరింత పటిష్ఠపరుస్తూ కొత్త జీవోను తీసుకొచ్చింది. ఇంతకీ ఆ జీవోలో ఏం ఉందంటే..
New G.O. in Clinical Establishment
By
Published : Jun 17, 2022, 9:23 AM IST
New G.O. in Clinical Establishment : రాష్ట్రంలోని కొన్ని కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రుల అడ్డగోలు దోపిడీకి అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంటు చట్టాన్ని మరింత పటిష్ఠపరుస్తూ సరికొత్త జీవోను తీసుకొచ్చింది. ఆ ప్రకారం ఇక నుంచి ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో, ల్యాబొరేటరీల్లో చికిత్సలు, నిర్ధారణ పరీక్షల రుసుములను నియంత్రించడానికి మార్గం సుగమమైంది.
అల్లోపతి సహా అన్ని ఇతర వైద్య విభాగాలను కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకొస్తూ కీలక సవరణ చేసింది. ఇప్పటి వరకూ కేవలం జిల్లా వైద్యాధికారుల చేతుల్లో మాత్రమే ఉన్న ఆసుపత్రులు, ల్యాబొరేటరీల అనుమతులు, పర్యవేక్షణాధికారాలను జిల్లా అథారిటీ(కౌన్సిల్)లకు కట్టబెట్టింది. ఈ మేరకు గురువారం వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వులు వెలువరించారు.
జిల్లా వైద్యాధికారులపై నియంత్రణ
కొత్త ఆసుపత్రిని ప్రారంభించాలన్నా, అనుమతులను పునరుద్ధరించాలన్నా ఇప్పటి వరకూ జిల్లా వైద్యాధికారుల చేతుల్లోనే అధికారమంతా కొనసాగుతోంది. దీంతో ఆసుపత్రులు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నా చూసీచూడనట్లుగా వెళ్తున్నారనే విమర్శలున్నాయి. ఇందులో ప్రైవేటు ఆసుపత్రుల నుంచి జిల్లా వైద్యాధికారులకు నెలనెలా భారీగా ముడుపులు ముడుతున్నట్లుగా పెద్దఎత్తున ఆరోపణలూ వచ్చాయి.
ఇదే తరహా వ్యవహారంలో రెండు నెలల కిందటే హైదరాబాద్ పరిసర జిల్లా వైద్యాధికారి రూ.5 లక్షలు లంచం తీసుకున్న విషయం బయటకు పొక్కింది. ఈ విషయం వైద్య మంత్రి వద్దకు చేరడంతో ఆ వైద్యాధికారిని తక్షణం బదిలీ చేశారు. ఇటువంటి వ్యవహారాలను చక్కదిద్దడానికి ప్రభుత్వం కొత్తగా తెచ్చిన క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టంలో కీలక సవరణలు చేసింది. దీంతో జిల్లా వైద్యాధికారుల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేసినట్లు అవుతుందని వైద్యవర్గాలు భావిస్తున్నాయి.
జిల్లా కౌన్సిల్ స్వరూపం, అధికారాలు
కలెక్టర్ ఛైర్మన్‌గా జిల్లా కౌన్సిల్ ఏర్పాటు.
కౌన్సిల్‌లో జిల్లా వైద్యాధికారి ఒక సభ్యుడిగా ఉంటారు.
ఇక నుంచి సింగిల్ క్లినిక్‌లు మొదలుకొని పెద్దాసుపత్రుల వరకూ అన్ని స్థాయుల్లోనూ జిల్లా కౌన్సిలే అనుమతులు ఇస్తుంది.
ఆసుపత్రులు, ల్యాబొరేటరీలపై పర్యవేక్షణాధికారం. లోపాలున్న ఆసుపత్రులు, ల్యాబోరేటరీలపై విచారణ, సాక్ష్యాల సేకరణ, చర్యలు తీసుకునే అధికారం.
బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరణ. ఆకస్మిక తనిఖీలు నిర్వహణ.
జరిమానాలు విధించడం, లోపాలు, ఆరోపణలను బట్టి సస్పెండ్ చేయడం, పరిస్థితి తీవ్రమైనదైతే అనుమతులు రద్దు చేయడం.
జిల్లా కౌన్సిల్ నిర్ణయాలపై ఆసుపత్రులు రాష్ట్ర కౌన్సిల్‌కు అప్పీల్‌కు వెళ్లడానికి అవకాశం ఉంటుంది.
ఈ చట్టం ద్వారా మెరుగైన వైద్యం : 'క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంటు చట్టంలో చేసిన తాజా సవరణల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుంది. ప్రస్తుతం ఉన్న వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడానికి అవకాశాలు మెరుగుపడ్డాయి. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో నాణ్యత పరిరక్షణ, రుసుంల నియంత్రణకు దోహదపడుతుంది. ఆసుపత్రులను నియంత్రించడానికి వీలవుతుంది.' - డాక్టర్ జి.శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకులు
ఆయుష్ కూడా.. ఇప్పటి వరకూ అల్లోపతి వైద్యం మాత్రమే క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్ట పరిధిలో ఉండగా.. తాజా సవరణల ప్రకారం ఆయుర్వేద, యునానీ, సిద్ధ, హోమియోపతి, యోగా, ప్రకృతి వైద్యం తదితర వైద్య విధానాలూ చట్టం చట్రంలోకి చేరినట్లైంది. ఈ వైద్య విధానాల్లో ఎందులో ప్రాక్టీసు చేయాలన్నా జిల్లా కౌన్సిల్ వద్ద అనుమతి పొందాల్సిందే.
దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా అనుమతులు/పునరుద్ధరణ చేస్తారు. తుది గడువుకు మూణ్నెళ్ల ముందుగా అనుమతి పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకోవాలి. గడువు ముగిసినా దరఖాస్తు చేయకపోతే.. సంబంధిత ఆసుపత్రి, క్లినిక్‌పై రోజుకు రూ.100 చొప్పున జరిమానా విధిస్తారు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం కింద అనుమతి పొందకుండా ఆసుపత్రి, క్లినిక్ నిర్వహిస్తున్నట్లుగా రుజువైతే రూ.50వేల నుంచి రూ.5 లక్షల వరకూ జరిమానా విధిస్తారు. అనుమతులు, పునరుద్ధరణ రుసుంలను గతంలో కంటే దాదాపు రెట్టింపు చేశారు. వసూలు చేసిన రుసుములను ప్రత్యేక నిధి కింద పక్కన ఉంచుతారు.