తెలంగాణ

telangana

ETV Bharat / city

బీఏ, బీకాం, బీఎస్సీలకు కొత్తరూపు

రోజురోజుకూ విస్తరిస్తున్న పోటీ ప్రపంచంలో సంప్రదాయ డిగ్రీ కోర్సులకు డిమాండ్ తక్కువవుతోంది. తెలంగాణ ఉన్నత విద్యామండలి బీఏ, బీకాంలలో కొత్త కోర్సులకు రూపకల్పన చేస్తోంది.

new cources in bsc bcom in telangana
బీఏ, బీకాం, బీఎస్సీలకు కొత్తరూపు

By

Published : Feb 22, 2020, 2:18 PM IST

సంప్రదాయ డిగ్రీ కోర్సులైన బీఏ, బీకాం, బీఎస్సీ కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. ఏదో ఒక కొలువుకు అవసరమైన నైపుణ్యాన్ని విద్యార్థులకు అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ ఉన్నత విద్యామండలి, కళాశాల విద్యాశాఖ ముందుకు కదులుతున్నాయి. పోటీ ప్రపంచంలో పరిశ్రమలు నైపుణ్యాలు ఆశిస్తుండటం... విద్యార్థులు సైతం డిమాండ్‌ ఉన్న కోర్సుల్లోనే ప్రవేశాలు పొందుతుండటం వల్ల కళాశాలలు ఆదరణ లేని కోర్సులను రద్దు చేసే పనిలో పడ్డాయి.

కొత్తకొత్తగా డిగ్రీ...

వచ్చే విద్యా సంవత్సరం నుంచి బీఎస్సీ డేటా సైన్స్‌, బీకాం బిజినెస్‌ అనలిటిక్స్‌ కోర్సులను ప్రవేశపెట్టాలని ఇటీవల ఉన్నత విద్యామండలి ప్రకటించింది. రాష్ట్రంలో మొదట 50-100 కళాశాలల్లో వీటికి అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.

డిగ్రీలోనూ వృత్తి విద్యాకోర్సులు రానున్నాయి. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ (బీవోక్‌) కోర్సును ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశపెట్టనున్నారు.

బీకాం జనరల్‌కు ఇప్పటివరకు మంచి డిమాండ్‌ ఉండగా.. గత ఏడాది అన్ని సర్కారు కళాశాలల్లో బీకాం జనరల్‌కు బదులు కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ తీసుకొచ్చారు. రాష్ట్రంలోని 125 డిగ్రీ కళాశాలల్లో 42 వేల మంది చేరగా ఒక్క బీకాం కంప్యూటర్స్‌లోనే 20 వేల మంది వరకు ప్రవేశాలు పొందారు.

కోర్సుల మార్పిడికి దరఖాస్తులు ఆహ్వానించగా రాష్ట్రవ్యాప్తంగా 400 సెక్షన్ల వరకు (ఒక్కో సెక్షన్‌కు 50-60 సీట్లు) మూసివేసి, డిమాండ్‌ ఉన్న వాటిని మంజూరు చేయాలని ఉన్నత విద్యామండలికి కళాశాల యాజమాన్యాలు దరఖాస్తు చేశాయి. అంటే మూడు సబ్జెక్టుల కాంబినేషన్లను మార్చుకుంటున్నారు. బీకాం జనరల్‌ రెండు సెక్షన్లు ఉంటే ఒక దాన్ని మూసివేసి దాని స్థానంలో బీకాం కంప్యూటర్‌ సైన్స్‌కు మొగ్గు చూపుతున్నారు. బీఎస్సీలో ఎలక్ట్రానిక్స్‌ బదులు స్టాటిస్టిక్స్‌ కోసం కళాశాలలు దరఖాస్తు చేశాయి. వీటితో పాటు బీఎస్సీ డేటా సైన్స్‌, బీకాం బిజినెస్‌ అనలిటిక్స్‌ వైపు యాజమాన్యాలు మొగ్గు చూపుతున్నాయి.

ఇటీవల బీఏలో చేరిన వారిలో వందలాది మంది... ముఖ్యంగా హైదరాబాద్‌లోని విద్యార్థులు సివిల్‌ సర్వీసెస్‌కు సన్నద్ధమవుతున్నారని... అందువల్ల బీఏ చరిత్ర, జాగ్రఫీ, పొలిటికల్‌ సైన్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ సబ్జెక్టులతో ఒకటి రెండు సెక్షన్లను కొనసాగించాల్సి వస్తోందని డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరమేశ్వర్‌ చెప్పారు.

ఇవీ చూడండి:'సీఏఏ, ఎన్​ఆర్​సీలపై మోదీతో ట్రంప్​ చర్చిస్తారు'

ABOUT THE AUTHOR

...view details