Corona Third Wave Telangana : ఓ వైపు ఒమిక్రాన్ కలకలం.. మరో పక్క వ్యాక్సినేషన్‌పై నిర్లక్ష్యం - తెలంగాణలో కొవిడ్ వ్యాక్సినేషన్
Corona Third Wave Telangana : కరోనా మహమ్మారి మొదటి, రెండు దశల్లో భాగ్యనగరాన్ని అతలాకుతలం చేసింది. తాజాగా దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇదే సమయంలో నగరంలోని లక్షలాది మంది రెండో డోసు టీకా విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కొంతమంది మొదటి డోసు వేసుకోవడానికి కూడా ముందుకు రావడం లేదు. ఆశా సిబ్బంది ఇళ్లకు వస్తున్నా కూడా.... 'అబ్బే.. మాకు వ్యాక్సిన్ అవసరం లేదు' అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మూడో దశలో కరోనా విజృంభిస్తే లక్షలాది మంది తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆందోళన నెలకొంది.
corona new variant Omicron
By
Published : Nov 28, 2021, 9:47 AM IST
Corona Third Wave Telangana 2021 : రెండో దశ కరోనా వైరస్ తీవ్రత తగ్గడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేసింది. ఆ తరువాత సాధారణ జీవనం మొదలైంది. ప్రజలు మాస్కు లేకుండానే రోడ్లమీదకు రావడం మొదలుపెట్టారు. వ్యాక్సిన్ వేసుకోకపోయినా కూడా ఏమి కాదులే అన్న భావనలోకి వచ్చేశారు. కరోనా భయంతో మొదటి డోసు టీకా తీసుకున్నవారు.. రెండో డోసు వేసుకోవడానికి ముందుకు రావడం లేదు. అంతెందుకు ఇప్పటికీ మొదటి డోసు వేయించుకోని వారు మూడు జిల్లాల పరిధిలో 10 లక్షలమంది ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.
covid vaccination in Hyderabad: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 200 కేంద్రాల్లో వ్యాక్సిన్ వేస్తున్నారు. ఒక్కో కేంద్రానికి గతంలో వెయ్యి నుంచి రెండువేల మంది వచ్చేవారు. ఇప్పుడు 200 మంది కూడా రావడం లేదు. నాంపల్లి పరిధిలోని శాంతినగర్ వెడ్‌గార్డెన్, ఇందిరానగర్ తదితర కేంద్రాలకు మూడు నెలల కిందట వరకు రోజుకు 3-4వేల మంది వచ్చేవారు. ఇప్పుడు రెండుమూడొందల మంది వస్తున్నారు. ఇదే పరిస్థితి అన్ని కేంద్రాల వద్ద ఉంది. మూడు జిల్లాల పరిధిలో సుమారు 25లక్షల మందికిపైనే రెండో డోసు వేసుకోలేదు. హైదరాబాద్ జిల్లాలో సుమారు 10 లక్షలమంది, రంగారెడ్డి జిల్లాలో 9లక్షల మంది, మేడ్చల్‌లో 7 లక్షల మంది రెండో డోసు వేయించుకోలేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మూడో దశ కూడా ఉద్ధృతంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో అందరికి రెండు డోసులు వేయించేలా సర్కారు చర్యలు తీసుకోవాల్సి ఉంది.
గాంధీ, టిమ్స్ ఆసుపత్రులు సంసిద్ధం
corona new variant Omicron: కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పట్ల వైద్య యంత్రాంగం అప్రమత్తమైంది. కొవిడ్ నోడల్ కేంద్రాలైన గాంధీ, టిమ్స్‌లో పడకలు ఇతరత్రా సౌకర్యాలపై సమీక్షించనున్నారు. గాంధీలో ప్రస్తుతం 650 ఐసీయూ, మరో 600 వరకు ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉన్నాయి. కేసుల సంఖ్య పెరిగితే ఎప్పటి మాదిరిగా ఈ రెండు చోట్ల కరోనా రోగులకు ఉచితంగా సేవలు అందించనున్నారు.
వైద్యులంతా అప్రమత్తంగా ఉన్నారు
"కొత్త వేరియంట్ ప్రభావం దృష్ట్యా అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి. కొందరు రెండో డోసుకు ముందుకు రావడం లేదు. ఇలాంటి వారంతా వెంటనే రెండో డోసు తీసుకోవాలి. ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా ఎదుర్కొనేందుకు గాంధీ వైద్యులంతా సిద్ధంగా ఉన్నారు. చేతి శుభ్రత, మాస్క్ ధరించడం కచ్చితంగా పాటించాలి."
-డా.రాజారావు, సూపరింటెండెంట్, గాంధీ ఆసుపత్రి
కట్టడి కోసం కార్యాచరణ అత్యవసరం
"ముఖ్యంగా కొత్త వేరియంట్లకు అడ్డుకట్ట వేయాలంటే ట్రాక్, టెస్టు, ట్రీట్ విధానం అనుసరించాలి. ఒమిక్రాన్ గురించి పూర్తి సమాచారం తెలియడానికి సమయం పడుతుంది. అంతకంటే ముందు కట్టడి కోసం కార్యాచరణ చాలా కీలకం."
-డాక్టర్ రంగారెడ్డి బుర్రి, అధ్యక్షులు, ఇన్‌ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా
చిన్నారులూ.. భద్రంగా ఉండండిలా..!
Corona New Variant News 2021 : కొత్త వేరియంట్ కలకలం... ప్రాథమిక తరగతుల విద్యార్థులకు సైతం ప్రత్యక్ష బోధన మొదలవడం... ఈ పరిస్థితుల్లో విద్యాసంస్థల్లో అక్కడక్కడా వెలుగుచూస్తున్న కరోనా కేసులతో తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాల్లో ఆందోళన నెలకొంది. బంజారాహిల్స్, పాతబస్తీ ప్రాంతాల్లోని రెండు ప్రైవేటు పాఠశాలల్లో ఇటీవల కరోనా కేసులు వెలుగు చూశాయి. తాజాగా టెక్ మహీంద్రా వర్సిటీలో 25 మంది విద్యార్థులకు కొవిడ్ సోకింది. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ బోధన కొనసాగించాల్సిన అవసరం కనిపిస్తోంది. మరోవైపు రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతిగృహాల్లో విద్యార్థులు ఒకేచోట ఉంటుంటారు. భౌతిక దూరం, మాస్కుల్లేకుండా తిరగడం ప్రమాదమే. విద్యార్థులు ఎడం పాటించేలా వార్డెన్ల పర్యవేక్షణ ఎప్పటికప్పుడు ఉండాలి. మెస్‌ల వద్ద సైతం భోజనం, అల్పహారం తీసుకునే సమయంలో భౌతికదూరం పాటించేలా చూడాలి.
ఎప్పటికప్పుడు శుభ్రత పాటిస్తే మేలు
"పిల్లలకు కరోనా సోకే అవకాశాలు చాలా తక్కువ అని శాస్త్రీయంగా నిరూపితమై లాన్సెట్ జర్నల్‌లోనూ ప్రచురితమైంది. ఒకవేళ సోకినా తీవ్రత తక్కువగా ఉంటోంది. ఎక్కడైనా కరోనా కేసులు వెలుగుచూస్తే పరిసరాలను శానిటైజ్ చేయించాలి. ఎడం పాటిస్తూ మాస్కులు పెట్టుకునేలా జాగ్రత్తలు పాటించాలి. "
- వాసిరెడ్డి అమర్‌నాథ్, విద్యావేత్త
తల్లిదండ్రులు, యాజమాన్యాలు జాగ్రత్తలు తీసుకోవాలి
కొవిడ్ వ్యాప్తి చెందకుండా పాఠశాల యాజమాన్యాలు రెండు పద్ధతులు తప్పకుండా పాటించాలి. స్కూల్లోని బస్‌డ్రైవర్లు, ఆయాలు మొదలుకుని ప్రిన్సిపల్ వరకు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుని ఉండాలి.
తరగతి గదుల్లో, పాఠశాల బస్సుల్లోనూ ఎడం పాటించాలి. పిల్లలకు థర్మల్ స్క్రీనింగ్ చేయాలి. ఎవరైనా జలుబు, దగ్గుతో కనిపిస్తే.. వెంటనే కరోనా పరీక్ష చేయించాలి.
తల్లిదండ్రుల విషయానికి వస్తే.. ఇంట్లో 18 ఏళ్లు నిండినవారంతా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలి.
పిల్లలకు ఇవ్వాల్సిన ఇతక టీకాలు తప్పకుండా ఇప్పించాలి.
పోషకాహారం, విటమిన్లు అందించడంతోపాటు 8 గంటల నిద్ర ఉండేలా చూడాలి. తద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.