తెలంగాణ

telangana

ETV Bharat / city

జాతీయ రహదారులకు మహర్దశ... రాష్ట్రం విజ్ఞప్తికి కేంద్రం గ్రీన్​సిగ్నల్​ - రాష్ట్రంలోని జాతీయ రహదారుల సమాచారం

రాష్ట్రంలోని జాతీయ రహదారులకు ఎట్టకేలకు మహర్దశ పట్టనుంది. హైవేలను అభివృద్ధి చేయాలనే రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తికి స్పందించిన కేంద్రం... రోడ్ల విస్తరణ, అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. 7 వేల 233 కోట్లతో 289 కిలోమీటర్ల జాతీయ రహదారుల పనులను ప్రారంభించనుంది. అందులో భాగంగా యాదాద్రి-వరంగల్ మార్గంలో సుమారు 1,890 కోట్లతో చేపట్టనున్న 99 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల పొడవు గల రోడ్డును... ఈ నెల 21న కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రారంభించనున్నారు.

national highways inaugurations in Telangana
national highways inaugurations in Telangana

By

Published : Dec 16, 2020, 3:53 AM IST

Updated : Dec 16, 2020, 6:30 AM IST

రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ, నూతన రహదారుల నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. మెరుగైన రోడ్లతో మరింత సౌకర్యవంతమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని జాతీయ రహదారుల సంస్థ భావిస్తోంది. అందులో భాగంగా 7 వేల 233 కోట్ల రూపాయలతో 289 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణాలను చేపట్టాలని ఎన్​హెచ్​ఏఐ నిర్ణయించింది. ఇందులో కేంద్రం ఇప్పటికే కొన్నింటిని పూర్తి చేసింది. జాతీయ రహదారుల సంస్థ ఆధీనంలోని... యాదాద్రి-వరంగల్ హైవే-163లో 1889.72 కోట్లతో చేపడుతున్న 99.103కిలోమీటర్ల నాలుగు వరుసల రోడ్డును ఈనెల 21న కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ దృశ్యమాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో సీఎం కేసీఆర్​తో పాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొననున్నారు.


రాష్ట్రంలో ఎన్​హెచ్​-161లోని కంది నుంచి రాంసాన్‌పల్లె వరకు వెయ్యి కోట్లతో నిర్మించనున్న 40 కిలోమీటర్లు, రాంసాన్‌పల్లె నుంచి మంగులూరు వరకు 1,234 కోట్లతో చేపట్టనున్న 47 కిలోమీటర్ల నాలుగు వరుసల రోడ్లకు గడ్కరీ భూమి పూజ చేయనున్నారు. ఎన్​హెచ్​-161 లోని మంగులూరు నుంచి తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు వరకు 936 కోట్లతో 49 కిలోమీటర్ల దూరం గల రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు. అటు ఎన్​హెచ్​-363 రేపల్లెవాడ నుంచి తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులను కలిపే విధంగా 1,140 కోట్లతో చేపడుతున్న 53 కిలోమీటర్ల రోడ్డుతో పాటు మంచిర్యాల నుంచి తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులను కలిపేలా 1,357 కోట్లతో నిర్మిస్తున్న 42 కిలోమీటర్లు రహదారి, సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు 1,566 కోట్లతో చేపట్టిన 59 కిలోమీటర్ల దూరం గల రోడ్డుకు భూమి పూజ చేయనున్నారు.

రాష్ట్ర రహదారుల ఆధీనంలో ఉన్న జాతీయ రహదారులకు సంబంధించి 1,827 కోట్లతో 270 కిలోమీటర్ల పనులను ప్రారంభించడంతో పాటు 511.71 కోట్లతో చేపట్టనున్న 107.25 కిలోమీటర్ల పనులకు గడ్కరీ భూమి పూజ చేయనున్నారు. ఎన్​హెచ్​-163లో మన్నెగూడ-రావులపల్లి సెక్షన్‌లో 359.27 కోట్లతో నిర్మించనున్న 72.53 కిలమీటర్ల రోడ్డు విస్తరణ పనులను ప్రారంభిస్తారు. వరంగల్ జిల్లాలోని ఎన్​హెచ్​-163లో 230 కోట్లతో 34కిలోమీటర్లతో పాటు జిల్లాలోనే 206కోట్ల13లక్షలతో 33.73 కిలోమీటర్ల రహదారి విస్తరణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు.

హైదరాబాద్ బాహ్యవలయ రహదారి నుంచి మెదక్ సెక్షన్‌లో 426 కోట్ల 52 లక్షలతో 62.92 కిలోమీటర్ల దూరం గల రోడ్డు పనులను గడ్కరీ ప్రారంభిస్తారు. దీంతో పాటు నకిరేకల్ నుంచి తానంచెర్ల సెక్షన్‌లో 605 కోట్ల 8 లక్షలతో 66.56 కిలోమీటర్లు, నిర్మల్-ఖానాపూర్ సెక్షన్‌లో 141.8 కోట్లతో 21.8 కిలోమీటర్లు, నకిరేకల్ - నాగార్జునసాగర్ సెక్షన్‌లో 369 కోట్ల 91 లక్షలతో 85.45 కిలోమీటర్ల మేర చేపడుతున్న రోడ్డు పనులకు ఆయన భూమి పూజ చేస్తారు.

ఇదీ చూడండి: దేశంలో కొవిడ్​ వ్యాక్సిన్​ పంపిణీకి రంగం సిద్ధం!

Last Updated : Dec 16, 2020, 6:30 AM IST

ABOUT THE AUTHOR

...view details