తెలంగాణ

telangana

ETV Bharat / city

NCDC: గొర్రెల పంపిణీ కార్యక్రమంపై ప్రశంసల వర్షం

రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఎన్​సీడీసీ బృందం అభినందించింది. గొల్ల, కురుమల అభివృద్ధికి తోడ్పాటునందించిందని కొనియాడింది. కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కుటుంబాలు ఆర్థికంగా పరిపుష్ఠి చెందాలనే లక్ష్యంతో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

ncdc team met minister talasani
ncdc team met minister talasani

By

Published : Aug 23, 2021, 10:11 PM IST

రాష్ట్రంలో గొల్ల, కురుమల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ కార్యక్రమం అద్భుతంగా ఉందని జాతీయ సహకార అభివృద్ధి సంస్థ - ఎన్‌సీడీసీ అధికారుల బృందం ప్రశంసించింది. దిల్లీ నుంచి వచ్చిన ఆ సంస్థ ఉన్నతాధికారులు సుదీప్​కుమార్​ శర్మ, ముఖేష్​ కుమార్, భూపేందర్‌సింగ్‌ నేతృత్వంలో బృందం హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్​లోని పశుసంక్షేమ భవన్‌లో పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కలిసింది.

గొర్రెల పంపిణీ కార్యక్రమం అమలు, సాధించిన ఫలితాలపై.. ఎన్‌సీడీసీ అధికారుల బృందానికి.. పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి తలసాని వివరించారు. కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కుటుంబాలు.. ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో అనేక కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు. రాష్ట్రంలో ఉన్న 7.61 లక్షల మంది గొల్ల, కురుమలకు ఒక యూనిట్ (20 గొర్రెలు, ఒక పొట్టేలు చొప్పున) రూ.1.25 లక్షలు ఖర్చు చేసి.. 75 శాతం రాయితీపై పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం 2017లో ప్రారంభించినట్లు చెప్పారు. మొదటి విడతలో 3,76,985 మంది లబ్ధిదారులకు 79.16 లక్షల గొర్రెలు పంపిణీ చేయగా... వాటికి ఒక కోటి 30 లక్షల గొర్రె పిల్లలు పుట్టాయని మంత్రి వివరించారు. పుట్టిన గొర్రె పిల్లల విలువ సుమారు 6,500 కోట్ల రూపాయలు ఉంటుందన్నారు.

అద్భుతమైన ఫలితాలు వచ్చాయి!

దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం వల్ల అద్భుతమైన ఫలితాలు వచ్చాయని మంత్రి తలసాని పేర్కొన్నారు. 2019 పశుగణన లెక్కల ప్రకారం.. గొర్రెల పంపిణీ, అభివృద్ధిలో తెలంగాణ 1.92 కోట్ల గొర్రెల సంఖ్యతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. దీంతోపాటు 1.22 లక్షల టన్నుల మాంసం ఉత్పత్తి జరిగిందని పేర్కొన్నారు.

రానున్న రోజుల్లో తెలంగాణ.. ఇతర దేశాలు, రాష్ట్రాలకు మాంసం ఎగుమతి చేసే దిశగా అభివృద్ధి చెందుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో గొర్రెల ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని యూనిట్​ ధర రూ 1.25 లక్షల నుంచి రూ.1.75 లక్షలకు పెంచినట్లు తెలిపారు. ఇందులో ప్రభుత్వ రాయితీ రూ.1,31,250 కాగా.. లబ్ధిదారుడి వాటా రూ.34,750 ఉంటుందని పేర్కొన్నారు. రెండో విడతలో రూ. 6,125 కోట్ల వ్యయంతో 3.5 లక్షల మంది అర్హులైన గొల్ల, కురుమలకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, గొర్రెల అభివృద్ధి సమాఖ్య ఎండీ డాక్టర్ రాంచందర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇదీచూడండి:kishan reddy: 'అన్ని పర్యాటక ప్రదేశాల్లోను టూరిస్టు పోలీస్​ స్టేషన్ పెట్టాలని ​ఉంది'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details