Nara Lokesh Questions CM Jagan : రైతురాజ్యం తెస్తానని గద్దెనెక్కి.. రైతుల్లేని రాజ్యంగా ఆంధ్రప్రదేశ్‌ని సీఎం జగన్‌మోహన్ రెడ్డి మార్చారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. జగన్ పాలనలో రైతులకు జరిగిన అన్యాయం, వ్యవసాయ రంగ సంక్షోభం.. రైతులపై జరిగిన దాష్టీకాలకు ఆయన.. సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాను అడిగే 17 ప్రశ్నలకు సమాధానం చెప్పాకే.. సీఎం జగన్ ఉపన్యాసాలు ఇవ్వాలన్నారు.
ఏపీ సీఎం జగన్‌కు.. నారా లోకేశ్ 17 ప్రశ్నలు.. ఏంటంటే..?
Nara Lokesh Questions CM Jagan : ఏపీ సీఎం జగన్‌పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. రైతు రాజ్యం తెస్తానని.. రైతుల్లేని రాజ్యంగా ఏపీని తీర్చిదిద్దారని ఎద్దేవా చేశారు. తాను అడిగే 17 ప్రశ్నలకు జగన్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు
నారా లోకేశ్ సంధించిన 17 ప్రశ్నలు
- అప్పుల అనుమతి కోసం వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరితాళ్లు బిగించింది ఎవరు?
- మూడేళ్ల పాలనలో ఒక్కటంటే ఒక్క చిన్న పిల్ల కాలువ తవ్వారా?
- ఒక్క చిన్న సాగు నీటి ప్రాజెక్ట్ కట్టారా?
- రైతుల నుంచి గత ఏడాది కొన్న ధాన్యం డబ్బులు ఇచ్చారా ? ఈ ఏడాది ధాన్యం కొన్నారా ?
- రూ.3500 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమైంది? ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడ?
- తుపాన్లు, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పంట నష్టం పరిహారం ఎంత ఇచ్చారో సమాధానం చెప్పాలి?
- పంటల బీమా ప్రీమియం కట్టినా రైతులకు ఇన్సూరెన్స్ ఎందుకు వర్తించలేదు?
- రూ.12,500 రైతు భరోసా ఇస్తానని.. రూ.7,500 ఇస్తుంది ఎవరు?
- రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కౌలురైతులను అసలు గుర్తించారా ?
- వ్యవసాయ యాంత్రీకరణ, డ్రిప్ ఇరిగేషన్, సూక్ష్మపోషకాలు లాంటివి ఏమయ్యాయి?
- కేంద్రం తెచ్చిన వ్యవసాయరంగ వ్యతిరేక బిల్లులకు మద్దతు ఇచ్చిన మూర్ఖుడు ఎవరు?
- ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో మర్చిపోయిన క్రాప్ హాలిడేను మళ్లీ తీసుకొచ్చిన అసమర్థుడు ఎవరు?
- తెదేపా హయాంలో రైతులకు రూ.3లక్షల వరకు సున్నావడ్డీ నిబంధనని కేవలం రూ.1లక్షకే పరిమితం చేసింది ఎవరు?
- రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉండటానికి కారకుడు జగన్ రెడ్డి కాదా?
- ముదిగొండలో 8 మంది రైతుల్ని కాల్చి చంపిన వైఎస్సార్ చరిత్రను మర్చిపోయారా?
- సోంపేటలో తమ భూముల్ని లాక్కోవద్దని ఆందోళన చేసిన ఆరుగురు రైతులని కాల్చి చంపించింది రాజశేఖర్ రెడ్డి కాదా?
- రాజధాని కోసం భూములిచ్చిన రైతులు శాంతియుతంగా ఆందోళనలు చేస్తే టెర్రరిస్టుల్లా అమరావతి రైతులకి సంకేళ్లు వేసింది ఎవరు?
సీఎం జగన్‌కు ధన్యవాదాలు : జగన్ రెడ్డి బాదుడు తట్టుకోలేని జనం.. గడప గడపకు వస్తున్న వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలను నిలదీస్తున్నారని నారా లోకేశ్ ధ్వజమెత్తారు. గడప గడపలో ఇదే వాయింపుడు తప్పదని ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో.. సీఎం పరదాలు, వలలు, ముందస్తు అరెస్టులు, దుకాణాల మూసివేతలుంటేనే బయటకొస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత ఏ రేంజ్లో ఉందో తన కార్యక్రమం ద్వారా రాష్ట్రమంతటికీ తెలియజేసినందుకు జగన్ రెడ్డికి ధన్యవాదాలు అని లోకేశ్ తెలిపారు.