చరిత్రలో అద్భుతమైన నాగరికతలు...విలాసమైన నగరాలు నదీ తీరాల్లోనే పుట్టుకొచ్చాయి. నాటి సింధూ నాగరికత నుంచి నేటి ఆధునిక నాగరికత వరకు....ఎన్నో చారిత్రక నిదర్శనాలు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. అంతటి గొప్ప విశిష్టత భాగ్యనగరానికీ ఉంది. నగరంలో ప్రవహించే మూసీ నది.....ఒకప్పుడు నగర ప్రజలకు జీవనవాహినిగా తులతూగింది. కానీ కొన్ని దశాబ్దాల్లోనే...పాలకుల అశ్రద్ధ, ముందుచూపు లేకుండా చేసిన మానవ తప్పిదాల కారణంగా నిర్జీవంగా మారింది. దేశంలోని ఐదు మృతనదుల్లో ఒకటిగా నిలిచింది.
దుఃఖదాయినిగా మారిన వరప్రదాయిని...
ఒకప్పుడు స్వచ్ఛమైన నీరు, అద్భుతమైన మత్స్యసంపద, పరివాహక ప్రాంతాల్లో ప్రకృతి అందాలతో తులతూగిన నది మూసీ. ప్రస్తుతం నాటి వైభవం కోల్పోయి మూగగా రోదిస్తోంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి చేరే వ్యర్థాలతో....భయంకరమైన కాలుష్యాన్ని కడుపున మోస్తోంది. ఆ నీరు, నేల, పీల్చే గాలి..అన్నీ కలుషితమేనని తెలిసినా...ఆ మట్టితో అనుబంధం తెంచుకోలేకఎన్నో జీవితాలు అక్కడే కాల ప్రవాహంతో కలిసి సాగిపోతున్నాయి. ఒకప్పుడు భాగ్యనగర వరప్రదాయిని అయిన మూసీ నది...నేడు ఎందరికో దుఃఖదాయినిగా మారింది.
అభివృద్ధి పేరుతో చేసిన విధ్వంసమిది...
మూసీనదిలో ప్రవహించే నీరు, అటుగా వీచే గాలి, పరిసరాలు, పండే పంటలు, పచ్చటి మొక్కలు...పాతాళం నుంచి ఉబికి వచ్చే నీరు..ఇలా ప్రతిదీ కాలుష్య కాసారమే. అభివృద్ధి పేరుతో మనిషి చేసిన విధ్వంసం తాలూకు దుష్ఫలితాలకు ఇదో ప్రత్యక్ష నిదర్శనం.అంబర్‌పేట మొదలుకొని మూసారాంబాగ్ సహా...నగర శివారులోని పీర్జాదిగూడ, పర్వతాపూర్, కాచవాని సింగారం, ప్రతాప సింగారం, వెంకటాపూర్, ఎదుల్లాబాద్, కొర్రెముల, గౌరెల్లి, బాచారం, బండరావిరాల గ్రామాలలో ఈటీవీ భారత్ పర్యటించింది.