రాష్ట్రంలో కరోనా కేసులు శరవేగంగా విజృంభిస్తున్న తరుణంలో.. రెండు నగరపాలికలు, ఐదు పురపాలికలకు... సాధారణ ఎన్నికలతోపాటు మరో 9 చోట్ల ఉపఎన్నికలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో రాజకీయ పార్టీల విజ్ఞప్తులు, హైకోర్టు సూచన మేరకు ప్రస్తుత పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలు, ఎన్నికల కొనసాగింపుపై ప్రభుత్వ అభిప్రాయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందుజాగ్రత్తలు తీసుకుంటామని కొవిడ్ నిబంధనలు పూర్తిగాపాటించేలా చర్యలు చేపడతామని ప్రభుత్వ హామీతో మినీ పురపోరు కొనసాగించాలని... ఎస్ఈసీ నిర్ణయించింది. ప్రతి ఒక్కరూ విధిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని స్పష్టంచేసింది. ఈమేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది.
మినీ పోల్స్: ప్రచారంలో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు - మినీ పురపోరు ప్రచారం
మినీ పురపోరు ప్రచారంలో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించే అభ్యర్థులు, పార్టీలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని... క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని... రాష్ట్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. సభలు, సమావేశాలు, ర్యాలీల్లో అంతా విధింగా కరోనా నిబంధనలు పాటించేలా చూడాల్సిన బాధ్యత పార్టీలు, అభ్యర్ధులదేనని స్పష్టంచేసింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం సాగితే అనుమతులు రద్దు చేయడంతో పాటు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎస్ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. స్టార్ క్యాంపెయినర్లు, అభ్యర్థులు కనీస నిబంధనలు పాటించకపోవడంపై కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రచార సమయం, గడువును ఎస్ఈసీ కుదించింది. రాత్రి 7 నుంచి ఉదయం 8 వరకు సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదన్న ఎన్నికల సంఘం... పోలింగ్‌కు 72 గంటల ముందే ప్రచారం ముగించాలని స్పష్టంచేసింది. ప్రచారపర్వంలో నేతలు కోవిడ్ నిబంధనలు పాటించకపోవడంపై ఎస్ఈసీ ఆగ్రహం వ్యక్తంచేసింది. స్టార్‌క్యాంపెయినర్లు, నేతలు,అభ్యర్థులు మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి కనీస మార్గదర్శకాలు పాటించడం లేదని అసంతృప్తి వ్యక్తంచేసింది. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన నేతలు... నిబంధనలు ఉల్లంఘిస్తూ వారితోపాటు ప్రజలను ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు వ్యాఖ్యానించింది. ఇంటింటి ప్రచారంలో ఐదుగురి కంటే ఎక్కువమంది ఉండరాదని.. రోడ్ షోల్లో వాహన శ్రేణిలోని రెండేసి చొప్పున వాహనాల మధ్య కనీసం 10 మీటర్ల దూరం ఉండాలని తెలిపింది. సభలు, సమావేశాలు నిర్వహించే... ప్రాంగణాలను అధికారులు ముందే గుర్తించాలని కొవిడ్ నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని స్పష్టంచేసింది. సభలు, ర్యాలీలకు హాజరయ్యే వారందరికీ మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత నిర్వాహకులదేనన్న ఎస్ఈసీ... అందుకయ్యే వ్యయాన్ని లెక్కలోకి తీసుకుంటామని తెలిపింది. నిబంధనలు పాటించేలా...... జిల్లా నోడల్ వైద్యశాఖ అధికారిని భాగస్వామ్యం చేయాలని సూచించింది. అధికారులు మొత్తం పరిస్థితిని నిత్యం పర్యవేక్షించాలని... ఎక్కడైనా నిబంధనలు పాటించకపోతే తక్షణమే అనుమతి రద్దు చేయడం సహా చట్టపర చర్యలు తీసుకోవాలని రాష్ట్రఎన్నికల సంఘం ఆదేశించింది.
స్టార్ క్యాంపెయినర్లు, నేతలు, అభ్యర్థులు విధిగా కొవిడ్ నిబంధనలను పాటించడంతో పాటు సమావేశాలు, ర్యాలీల ప్రారంభంలోనే మద్దతుదారులకు విజ్ఞప్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది.పార్టీలు, అభ్యర్థులు కరోనా నిబంధనలను తూచా తప్పకుండా పాటించాల్సిందేనన్న ఎస్ఈసీ ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని క్రిమినల్ చర్యలు నమోదు చేస్తామని హెచ్చరించింది. నిబంధనలు విధిగా పాటించేలా పరిశీలకులు, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు, పోలీసులు పూర్తి స్థాయిలో పర్యవేక్షించి తగు చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.