పుర ఎన్నికల రిజర్వేషన్ల మొదటి విడత పూర్తి పుర ఎన్నికల్లో కీలకమైన రిజర్వేషన్ల మొదటి విడత ప్రక్రియ పూర్తైంది. ఎన్నికలు జరుగనున్న పది కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లో వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేశారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు యూనిట్‌గా వార్డుల వారీ రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేశారు. 2011 జనాభా లెక్కలకు అనుగుణంగా ... దామాశా పద్ధతిలో ఎస్టీ, ఎస్సీలకు రిజర్వేషన్లు కేటాయించారు. 50శాతానికి మించకుండా మిగతా రిజర్వేషన్లను బీసీలకు కేటాయించారు. పురపాలక చట్టానికి లోబడి ఆయా పట్టణాల్లో ఒకశాతానికి తక్కువగా ఎస్టీ జనాభా ఉన్నప్పటికీ విధిగా ఒక స్థానాన్ని ఆ వర్గానికి రిజర్వు చేశారు. అన్ని కేటగిరిల్లోనూ సగం సీట్లను మహిళలకు కేటాయించారు.
ఎన్నికలు జరగనున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో వార్డుల రిజర్వేషన్ల లెక్క తేలింది. ఆయా వర్గాలకు దక్కిన వార్డుల సంఖ్యకు సంబంధించి స్పష్టత వచ్చింది. మొత్తం 3,112 వార్డులకు గాను.... మహిళలకు 1539 వార్డులు రిజర్వయ్యాయి.
చాలా చోట్ల ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లలో మహిళల సీట్ల సంఖ్య 50శాతానికి చేరలేదు. దీంతో ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు యూనిట్‌గా జనరల్ మహిళా కోటాలో ఎక్కువ సీట్లు కేటాయించారు. ఆ మేరకు జనరల్ సీట్ల కంటే జనరల్ మహిళా సీట్లు ఎక్కువగా వచ్చాయి. మొత్తం మహిళలకు రిజర్వైన వార్డుల సంఖ్య 1,539. మొత్తం వార్డులైన 3,112వార్డుల్లో మహిళలకు 49.45 శాతం దక్కాయి. కార్పొరేషన్ మున్సిపాలిటీ యూనిట్ గా తీసుకున్నందువల్ల 50 శాతానికి స్వల్ప తగ్గుదల ఉంది. అయితే మేయర్, ఛైర్ పర్సన్ పదవులు మహిళలకు రిజర్వైన చోట జనరల్ సీట్లలోనూ మహిళలు బరిలో దిగే అవకాశం ఉంది. దీంతో మహిళల ప్రాతినిధ్యం 50 శాతాన్ని మించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
వార్డుల వారీ రిజర్వేషన్లు రేపు జిల్లాల్లో ఖరారవుతాయి. రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్లు సమావేశాలు నిర్వహించి తుది రిజర్వేషన్లను ఖరారీ చేస్తారు. మహిళలకు దక్కే సీట్లను లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు.