పురపాలక ఎన్నికల కోసం వార్డుల వారీ ఓటర్ల జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు విడుదల చేసింది. కొత్త పురపాలక చట్టానికి అనుగుణంగా సిద్ధం చేయాలని ఆదేశించింది. శాసనసభ నియోజకవర్గాల వారీ ఓటర్ల జాబితా ఆధారంగా వార్డుల ఓటర్ల జాబితా తయారీ చేయాలని ఎస్ఈసీ సూచించింది. ఈ బాధ్యతను కార్పోరేషన్లు, మున్సిపాల్టీల్లో కమిషనర్లకు, జీహెచ్ఎంసీలో డిప్యూటీ కమిషనర్లకు అప్పగించింది.
తొలగింపులు, చేర్పులు చేయరాదు..
రాష్ట్ర ఎన్నికలసంఘం రూపొందించిన టీఈ పోల్ సాఫ్ట్వేర్ సాయంతో వార్డుల వారీ ఫోటో ఓటర్ల జాబితాలు రూపొందించాలని సూచించింది. తయారీ సమయంలో ఓటర్ల జాబితలో ఎటువంటి తొలగింపులు, చేర్పులు చేయరాదని.. అసెంబ్లీ నియోజకవర్గాల జాబితాలకు భిన్నంగా ఉండరాదని స్పష్టం చేసింది. జాబితాలో ఏవైనా అచ్చుతప్పులు ఉంటే బాధ్యుల దృష్టికి తీసుకెళ్లి సరిచేయాలని, జాబితాలో కులం, మతం వివరాలు పొందుపర్చరాదని ఈసీ పేర్కొంది.