తెలంగాణ

telangana

ETV Bharat / city

పుర ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం నేడే...

పురపాలక ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ నేడు పూర్తి కానుంది. మేయర్, ఛైర్ పర్సన్ల రిజర్వేషన్లను రాష్ట్ర స్థాయిలో... వార్డుల వారీ రిజర్వేషన్లను జిల్లా స్థాయిలో ప్రకటిస్తారు. లాటరీ విధానంలో మహిళలకు సగం సీట్లను కేటాయిస్తారు. ఇప్పుడు ఎన్నికలు లేని హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పదవుల రిజర్వేషన్లు కూడా ఇప్పుడే తేలుతాయి. రిజర్వేషన్ల ఖరారుతో ఎన్నికల కోసం ప్రభుత్వపరంగా చేయాల్సిన ప్రక్రియ అంతా పూర్తవుతుంది.

muncipal elections in telangana
పుర ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం నేడే...

By

Published : Jan 5, 2020, 6:06 AM IST

Updated : Jan 5, 2020, 7:23 AM IST

పుర ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం నేడే...

పుర ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం నేడు పూర్తి కానుంది. ఎన్నికలకు కీలకమైన పదవుల వారీ రిజర్వేషన్లను ఇవాళ ప్రకటిస్తారు. ఇప్పటికే వార్డుల వారీ ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికలు జరగనున్న 120 మున్సిపాలిటీలు, పది కార్పొరేషన్లలో ఈ మేరకు ఓటర్ల తుదిజాబితాలను ప్రకటించారు. జాబితాలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసిన పురపాలక శాఖ... పదవుల రిజర్వేషన్లను కూడా ప్రకటించింది. పది కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల వార్డులను ఆయా వర్గాలకు కేటాయించింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు యూనిట్​గా తీసుకొని వార్డులను ఆయా వర్గాల వారీగా వర్గీకరించారు. 13 కార్పొరేషన్లు యూనిట్​గా మేయర్ పదవులను, 128 మున్సిపాలిటీలు యూనిట్​గా ఛైర్​పర్సన్ పదవులను ఆయా వర్గాల వారీగా వర్గీకరించాల్సి ఉంది.

తుది రిజర్వేషన్లు నేడే ఖరారు

పదవులకు సంబంధించిన తుది రిజర్వేషన్లు ఇవాళ ఖరారవుతాయి. ఇందుకోసం పురపాలక శాఖ సంచాలకులు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేయనున్నారు. వార్డుల వారీ రిజర్వేషన్లు జిల్లా స్థాయిలో ఖరారవుతాయి. జిల్లాల్లో కలెక్టర్లు, రాజకీయ పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేసి మొదట ఎస్టీ రిజర్వేషన్లను ప్రకటిస్తారు. ఇందుకోసం ఎస్టీ ఓటర్ల వివరాలను అవరోహణ క్రమంలో తీసుకుంటారు. ఎక్కువ ఎస్టీ ఓటర్లు ఉన్న వాటిని నిర్దేశిత సంఖ్యలో ఎస్టీలకు కేటాయిస్తారు. ఎస్టీలకు కేటాయించిన సీట్లలో సగం లాటరీ ద్వారా మహిళలకు రిజర్వ్ చేస్తారు. ఎస్టీలకు రిజర్వ్ అయిన వాటిని పక్కన పెట్టి ఎస్సీ ఓటర్ల వివరాలను అవరోహణ క్రమంలో తీసుకుంటారు. ఎక్కువ ఎస్సీ ఓటర్లు ఉన్న వాటిని నిర్దేశిత సంఖ్యలో వారికే రిజర్వ్ చేస్తారు. ఎస్సీలకు రిజర్వ్ చేసిన స్థానాల్లో సగం సీట్లను మహిళలకు లాటరీ ద్వారా కేటాయిస్తారు.

మహిళలకు లాటరీ ద్వారా సగం స్థానాలు..

ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేసిన వాటిని పక్కనపెట్టి బీసీ ఓటర్ల వివరాలను అవరోహణ క్రమంలో తీసుకుంటారు. ఎక్కువ ఓటర్లు ఉన్న వాటిని నిర్దేశిత సంఖ్యలో బీసీలకు కేటాయిస్తారు. బీసీలకు రిజర్వ్ అయిన వాటిలో సగం సీట్లను లాటరీ ద్వారా మహిళలకు కేటాయిస్తారు. ఎస్టీ, ఎస్సీ, బీసీలకు రిజర్వ్ అయిన వాటిని మినహాయించి మిగిలిన వాటిలో సగం స్థానాలను మహిళలకు లాటరీ ద్వారా కేటాయిస్తారు. దీంతో పదవుల వారీ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తవుతుంది. రిజర్వేషన్లు ఖరారైతే రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ముందస్తు ప్రక్రియ అంతా పూర్తైనట్లే. వాటి ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల ఏడో తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనుంది.

ఇవీ చూడండి: పుర ఎన్నికల రిజర్వేషన్ల మొదటి విడత పూర్తి

Last Updated : Jan 5, 2020, 7:23 AM IST

ABOUT THE AUTHOR

...view details