కమీషన్ల కోసమే దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌ను కలిసి.. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం, రాయలసీమ ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు ప్రాజెక్టుల గురించి బోర్డు అధికారులకు వివరించారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి 2014లోనే అనుమతులు వచ్చినట్లు బోర్డు ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లినట్లు రేవంత్‌రెడ్డి తెలిపారు. నికర జలాలను కేటాయిస్తూ జారీచేసిన జీవో 69 పత్రాలను వారికి అందజేసినట్లు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. 69 జీవో గురించి తెలిసి అధికారులే ఆశ్యర్యపోయారని.. ఇది ఇంతవరకు తమ దృష్టికే రాలేదని చెప్పినట్లు రేవంత్ వివరించారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని అపెక్స్ కౌన్సిల్ అజెండాలో చేర్చాలని అధికారులను కోరినట్లు రేవంత్‌రెడ్డి తెలిపారు. లేకుంటే హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాటు సామర్థ్యం పెంపుతో.. జలాలతో పాటు విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల్లోనూ తెలంగాణకు అన్యాయం జరుగుతుందని బోర్డు దృష్టికి తీసుకెళ్లినట్లు రేవంత్ తెలిపారు. కమీషన్ల కోసమే రాయలసీమకు నీళ్లు తరలించుకుపోతున్నా.. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను.. కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని రేవంత్ ఆరోపించారు.