వరదలప్పుడు మూసీ ప్రవాహాన్ని చూడడానికి నగర ప్రజలు ఉత్సుకత చూపించారు. ఎన్ని ప్రభుత్వాలు తలచుకున్నా వదలని దుర్గంధం ఒక్క ప్రవాహంతో కొట్టుకుపోయిందని ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు పరివాహక ప్రాంతాల ప్రజలు స్వచ్ఛమైన గాలిని పీల్చుతున్నారు. నది ప్రక్షాళనకు గతంలో అనేక ప్రాజెక్టులు తెరమీదకొచ్చినా కార్యరూపం దాల్చలేదు. తాజాగా ఈ బాధ్యతలను తీసుకున్న మూసీరివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎంఆర్‌డీసీ) ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నదిలో తలపెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేసి నయనమనోహరంగా తీర్చిదిద్దాలని కోరుతున్నారు.
పరిశుభ్రంగా ఎంజీబీఎస్ పరిసరాలు..
ఆసియాలోనే అతిపెద్ద బస్‌స్టేషన్ అయిన మహాత్మాగాంధీ బస్‌స్టేషన్(ఎంజీబీఎస్) ఊపిరి పీల్చుకుంటోంది. రోజూ 1.20 లక్షల మంది ఇక్కడికి వచ్చి వెళ్లే 3500 బస్సుల్లో ప్రయాణించేవారు. ప్రాంగణంలో ఉన్నంత వరకూ దుర్వాసనతో ఇబ్బంది పడేవారు. ప్లాస్టిక్ సంచులు, పిచ్చి మొక్కలతో మురుగు కంపు భరించలేని విధంగా ఉండే నది ఇటీవల వరదలతో కడిగేసినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు ఎలాంటి దుర్వాసన రావట్లేదని ప్రయాణికులంటున్నారు. ఇక్కడి మెట్రో జంక్షన్ నుంచి రాకపోకలు సాగించే వారికీ దుర్గంధం నుంచి విముక్తి లభించింది.
లంగర్‌హౌస్ నుంచి ఉప్పల్ వరకూ..
లంగర్‌హౌస్ దగ్గర ఈసీ - మూసీ నదుల సంగమం నుంచి ఉప్పల్ వరకు దాదాపు 50 కిలోమీటర్ల మేర నగరంలో ప్రయాణిస్తోంది మూసీ నది. ఈ పరీవాహకంలో వేలాది బస్తీలు, వందల కాలనీలున్నాయి. ఆయా బస్తీల్లో 45 వేల మంది వరకూ నివసిస్తున్నారు. ఇటీవల వరదలతో వీరంతా ఇబ్బంది పడినా.. ఇప్పుడు స్వచ్ఛమైన వాతావరణంతో కాస్త సేదదీరుతున్నారు. దశాబ్దాలుగా మురుగు కంపును భరించాం.. ఇప్పుడు పరిశుభ్రమైన నదిని చూస్తున్నాం. ఇలాగే ఉంచేందుకు అధికారులు, పాలకులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.