Monsoon Raithubandhu: అన్నదాతలకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. వానాకాలం పెట్టుబడి సాయాన్ని 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఎప్పటిలాగానే వరుస క్రమంలో అన్నదాతాల ఖాతాల్లో రైతుబంధు నిధులను ప్రభుత్వం జమ చేయనుంది. తక్కువ విస్తీర్ణం ఉన్న వారితో ప్రారంభించి రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని వారి బ్యాంకుల ఖాతాల్లో జమ చేస్తారు. వానాకాలం సీజన్ కు రైతుబంధు కింద 7600 కోట్ల రూపాయలు సాయం అందించే అవకాశం ఉంది.
అన్నదాతలకు శుభవార్త.. 28 నుంచి రైతుబంధు నిధులు విడుదల - 28 నుంచి రైతుబంధు నిధులు విడుదల
18:29 June 22
అన్నదాతలకు శుభవార్త.. 28 నుంచి రైతుబంధు నిధులు విడుదల
ఈ నెల 28 నుంచి 9వ విడత పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయనున్నామని వ్యవసాయ శాఖ సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక నిబంధనల పేరిట ఎన్ని కొర్రీలు పెట్టి ఇరికించాలని చూసినా కూడా రైతుబంధు పథకం ఆగదన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతుబంధు పథకం అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు అన్నదాతల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రికి రైతుల పట్ల ఉన్న అభిమానం, వ్యవసాయ రంగం పట్ల ఉన్న మక్కువకు ఇది నిదర్శనమని స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ప్రతిష్టాత్మక రైతుబంధు పథకం అమలు జరుగుతోందన్నారు. ఈ మేరకు మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది వ్యవసాయం బాగుండాలి... పంటలు బాగా పండాలి... రైతుల కష్టానికి రైతుబంధు సాయం ఆసరా అవుతుందని తాము ఆశిస్తున్నామని అన్నారు.
ఈ నెల 28వ తేదీ నుంచి రైతుబంధు అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో అర్హులైన రైతుల వివరాలు పంపించాలని సీసీఎల్ఏను వ్యవసాయ శాఖ కోరిందని చెప్పారు. గతేడాది వానా కాలంలో 60.84 లక్షల మంది రైతులకు 7360.41 కోట్ల రూపాయలు రైతుబంధు పథకం కింద సాయం అందించగా... గత యాసంగిలో 63 లక్షల మంది రైతులకు 7412.53 కోట్ల రూపాయలు రైతుబంధు సాయం అందించామని ప్రకటించారు. 2022 - 23 సంవత్సరం సంబంధించి బడ్జెట్‌లో రైతుబంధు కోసం 14,800 కోట్ల రూపాయలు కేటాయించామని గుర్తు చేశారు. ఇప్పటి వరకు 8 విడతల్లో మొత్తం 50,447.33 కోట్ల రూపాయలు సాయం అందించామని వెల్లడించారు. యధావిధిగా రైతుబంధు సాయం అందించనున్న దృష్ట్యా... గతంలో మాదిరిగానే రోజుకు ఎకరా చొప్పున ఆరోహణ క్రమంలో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఇవీ చూడండి: